ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తా
అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకర్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్కే నగర్ ఎన్నికలో బరిలో తాను నిలుస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 31లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీని మద్రాసు హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్టోబర్ 12న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాగా, అర్కే నగర్ నియోజకవర్గానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. గత డిసెంబర్లో ఆమె కన్నుమూయడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఆర్కే నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ భారీ ఎత్తున డబ్బు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టడం, అవినీతి ఆరోపణల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ఉప ఎన్నికను వాయిదా వేసిన సంగతి తెలిసినదే.













