వారికి త్వరలోనే సరైన గుణపాఠం: దినకరన్
ఎఐఎడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను పార్టీనుంచి తొలగించాలనుకున్న వారికి బుద్ధి చెప్పడమే తనతో ఉన్న ఎమ్మెల్యేల లక్ష్యమని శశికళ మేనల్లుడు, ఎఐఎడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ అన్నారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను వారు (పళనిస్వామి, పన్నీర్‌సెల్వం) కొనలేరని ఆయన చెప్పారు. పార్టీ నుంచి శశికళను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్న వారికి త్వరలోనే సరైన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందని, వారంతా కూడా డబ్బు కోసం రావట్లేదని, స్వచ్ఛందంగా వస్తున్నారని స్పష్టం చేశారు. దినకరన్‌కు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. ఇప్పటివరకు దినకరన్ పక్షాన 19 మంది ఎమ్మెల్యేలుండగా, శనివారం నాటికి ఆ సంఖ్య 21కి చేరింది. ఇక, ప్రభుత్వ చీఫ్‌విప్ రాజేంద్రన్‌ను పార్టీ నుంచి దినకరన్ తొలగించారు.













