13 జిల్లాలు… 13 నిమిషాలేనా?
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి 13 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించటాన్ని నిరసిస్తూ విజయవాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన వినిపించేందుకు 13 నిమిషాల సమయం ఎలా సరిపోతుందని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని మోడీ మరిపిస్తున్నారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే, వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై గత మూడు నెలలుగా కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తన నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ్టి అవిశ్వాస తీర్మానంపైనా ముఖ్యమైన కూడళల్లో ఫ్లెక్సీలు కట్టారు.













