షర్మిల తనను తాను ఎక్కువగా ఊహించుకుంటోందా..?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలనే పట్టుదలతో పార్టీ పెట్టారు వై.ఎస్. షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె ఇటీవలికాలం వరకూ చాలా హడావుడి చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయినా ఆమె పార్టీకి మాత్రం అనుకున్నంత స్పందన రాలేదు. వైఎస్ అభిమానులుగా చెప్పుకునే నేతలు సైతం షర్మిల పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజల నుంచి కూడా ఆశించినంత అభిమానం కనిపించలేదు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. పార్టీని విలీనం చేస్తానని ప్రతిపాదించారు. వాళ్లు కూడా సరేనన్నారు కానీ ఎటూ తేల్చలేదు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల డిసైడయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం సంగతి ఎటూ తేలకపోవడంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఏపీ, తెలంగాణ నేతల ద్వారా రాయబారం నడిపితే కష్టమని భావించిన షర్మిల.. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడిపారు. అయన ఎంత చేయాలో అంతా చేశారు. కానీ షర్మిల డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ తలొగ్గలేదు. అందుకే విలీనం ఆగిపోయింది. దీంతో షర్మిల ఒంటరిగా పోటీ చేయక తప్పలేదు. అందుకే చాలా నెలల తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు షర్మిల. ఇందులో షర్మిల చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో విలీనమై కేసీఆర్ ను ఎదుర్కోవాలనుకున్నానని షర్మిల చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలలుగా ఎటూ తేల్చకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. ఆసక్తికర అభ్యర్థులు బీఫారాల కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల ఆహ్వానించారు. తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానన్న షర్మిల.. మరో చోట నుంచి కూడా పోటీ చేయాలనే డిమాండ్ ఉందన్నారు. అంతేకాదు.. బ్రదర్ అనిల్, తల్లి విజయమ్మ కూడా పోటీ చేయాలని అభిమానులు కోరుతున్నట్టు షర్మిల వివరించారు. సికింద్రాబాద్ నుంచి అనిల్, మిర్యాలగూడ నుంచి విజయమ్మ పోటీ చేసే అవకాశం ఉందని వైఎస్సార్టీపీ వర్గాలు చెప్తున్నాయి.
తాము ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్లీ కేసీఆర్ గెలుస్తారని షర్మిల చెప్పడాన్ని చాలా మంది నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంలో ట్రోల్స్ అవుతున్నాయి. షర్మిలక్క తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని సెటైర్స్ వేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి కనీసం ఒక్క చోటయినా డిపాజిట్ దక్కించుకోవాలని సూచిస్తున్నారు. మరి షర్మిల పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా.. డిపాజిట్లు దక్కించుకుంటుందా.. అనేది వేచి చూడాలి.













