కాంగ్రెస్ కు జై కొట్టిన షర్మిల.. ఎన్నికల్లో పోటీకి దూరం!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతోనే తాము పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వివరించారు. అంతేకాదు.. తాము కాంగ్రెస్ పార్టీకి భేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినట్లయింది.
తెలంగాణలో రాజన్నరాజ్యం తీసుకువస్తామని చెప్పి పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని, ఇది తన మెట్టినిల్లు కావడంతో తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందని భావించి ఆమె పార్టీ స్థాపించారు. ఆ వెంటనే తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరుడు జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర అధికారాన్ని చేరువ చేసింది. దీంతో ఆమె కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. అయితే ఆమె అనుకున్నంత మైలేజ్ మాత్రం రాలేదు. పెద్దగా నేతలెవరూ ఆమె పార్టీ వైపు చూడలేదు. ప్రజల నుంచి కూడా స్పందన లభించలేదు.
దీంతో ఆమె పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే చివరి ప్రయత్నంగా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ఆమె కర్నాటక కీలక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక లను కూడా కలుసుకున్నారు. విలీనానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. అయితే ఆమె రాకను అటు ఏపీ, ఇటు తెలంగాణ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో విలీన ప్రక్రియ మూలన పడింది. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఒంటరిగానే పోటీ చేసేందుకు ఓ దశలో షర్మిల సిద్ధమయ్యారు. ఈసీ కూడా ఆమె పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయించింది. అయితే ఆమె పార్టీ తరపున పోటీ చేసేందుకు నాయకులు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం కంటే విరమించుకోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే భవిష్యత్తులో తనకు ఏదో ఒక లబ్ది చేకూరుతుందని భావించారు. అందుకే పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు షర్మిల ప్రకటించారు.













