షర్మిల పార్టీకి విజయమ్మ అండాదండా!
రేపే షర్మిల పార్టీ ప్రకటించబోతున్నారు. తెలంగాణలో రాజన్నరాజ్యం తేవడమే లక్ష్యంగా తాను పార్టీ పెట్టబోతున్నట్టు షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో రాజన్నరాజ్యం లేదని.. వై.ఎస్. ఆశయాల సాధనకోసం ఇక్కడ పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఖమ్మం వేదికగా రేపు పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. పార్టీ ఏర్పాటు సభ కోసం ఆమె అభిమానులు, అనుచరులు బిజీబిజీగా ఉన్నారు. ఈ పార్టీ ప్రకటన సభకోసం తల్లి విజయమ్మ రాబోతున్నారు. కుమార్తె షర్మిలను ఆశీర్వదించబోతున్నారు.
విజయమ్మ ఇప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. పార్టీ అధినేత జగన్ మాత్రం తెలంగాణతో సత్సంబంధాల కోసం వైసీపీని తెలంగాణలో విస్తరించేందుకు సుముఖంగా లేరు. విజయమ్మ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు.. షర్మిల పార్టీ పెట్టడం కూడా జగన్ కు ఇష్టంలేదన్నారు. అయితే తన మెట్టినిల్లు తెలంగాణలో పార్టీ పెట్టాలనే నిర్ణయం షర్మిల తీసుకున్నారని.. అవి వారి ఇష్టాలే కానీ.. విభేదాలు కావని విజయమ్మ స్పష్టం చేశారు.
ఇప్పుడు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ షర్మిల సభకు హాజరవుతున్నారు. అయితే విజయమ్మ రాకపై అనేకమంది అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. అయితే బిడ్డను ఆశీర్వదించడానికి తల్లి హోదాలో మాత్రమే విజయమ్మ హాజరవుతున్నారని షర్మిల అనుచరులు క్లారిటీ ఇచ్చారు. దీనిపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే విజయమ్మ సభలో ఏం చెప్తారనే ఆసక్తి మాత్రం నెలకొంది.
అయితే కుమారుడు జగన్ సక్సెస్ అయినట్లుగానే కుమార్తె విజయాన్నీ చూడాలనుకుంటున్నారు విజయమ్మ. అందుకే షర్మిల పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తెరవెనుక విజయమ్మ అండదండలు అందిస్తున్నారు. నాడు తెలంగాణలో వై.ఎస్.తో సన్నిహితంగా మెలిగిన అధికారులు, అభిమానులు, అనుచరులతో మాట్లాడి షర్మిలకు సహకరించాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకే పలువురు ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు షర్మిలను కలిశారు. పార్టీ జెండా, అజెండా రూపకల్పనలో వారంతా సహాయపడుతున్నారు. మున్ముందు మరింతమంది వై.ఎస్.అభిమానులు విజయమ్మ విజ్ఞప్తి మేరకు షర్మిల వెంట నడుస్తారని తెలుస్తోంది. బిడ్డలు విజయం సాధించినప్పుడే తల్లిదండ్రులకు ఆనందం. ఇప్పుడు జగన్ విజయాన్ని విజయమ్మ ఆస్వాదిస్తున్నారు. అలాగే షర్మిల విజయాన్ని కూడా ఆస్వాదించాలనుకుంటున్నారు.













