పాలేరు నుంచి షర్మిల ఔట్..!? కొత్త సీటు తెరపైకి తెచ్చిన కాంగ్రెస్..!!
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలని.. అప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు షర్మిల. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి పలు కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలో ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయినా ఆమె పార్టీకి పెద్దగా స్పందన రాలేదు. అయినా షర్మిల మాత్రం మొక్కవోని దీక్షతో పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఒంటరిగా వెళ్తే కష్టమని భావించిన షర్మిల పలు పార్టీలతో పొత్తు ప్రతిపాదన తెచ్చారు. అయితే ఎవరి నుంచీ కూడా సానుకూల స్పందన రాలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు కష్టమని.. పార్టీనే విలీనం చేయాలని సూచించింది. ఇన్నాళ్లూ పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్న షర్మిల ఇప్పుడు సీటు కూడా మార్చుకున్నట్టు తెలుస్తోంది.
కుటుంబ విభేదాల కారణంగా ఆంధ్రా నుంచి తెలంగాణకు పూర్తిగా మకాం మార్చేశారు షర్మిల. ఆంధ్ర రాజకీయాల్లో ఇక తనకు స్థానం లేదని భావించి తెలంగాణ కోడలిగా ఇక్కడ సత్తా చాటాలనుకున్నారు. పార్టీ పెట్టారు. బాగా తిరిగారు. రాజన్న బిడ్డగా తనను ప్రజలు, నాయకులు అక్కున చేర్చుకుంటారని షర్మిల భావించారు. కానీ షర్మిల పార్టీకి పెద్దగా స్పందన రాలేదు. చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆమె పార్టీలో చేరేందుకు సాహసించలేదు. దీంతో ఆమె ఒంటరిపోరాటం చేయాల్సి వచ్చింది. అయితే ఈ పోరాటంతో లాభం లేదనుకున్నారామె. కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారు. పార్టీని విలీనం చేస్తే పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహకారంతో ఆమె కాంగ్రెస్ హైకమాండ్ కి టచ్లోకి వెళ్లారు. రాహుల్, ప్రియాంకలతో కూడా మాట్లాడినట్టు సమాచారం. గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం కాబోతోందని ప్రచారం జరిగింది. అయితే షర్మిల డిమాండ్లు ఒకలా ఉంటే కాంగ్రెస్ సూచనలు మరోలా ఉంటున్నాయి. అందుకే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. షర్మిలను ఏపీకి పరిమితం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. షర్మిల మాత్రం ఏపీకి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. అయితే షర్మిల మాత్రం తన ప్రయత్నాలు ఆపట్లేదు. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతోంది. మిగిలిన నేతల నుంచి కాస్త సానుకూల స్పందన వస్తున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు.
పైగా షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. పొంగులేటి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరి తను చెప్పినవాళ్లకు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో షర్మిలను పాలేరులో అకామడేట్ చేయడం కష్టమనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో షర్మిలను సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి బరిలోకి దింపేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లో క్రిష్టియన్ పాపులేషన్ ఎక్కువ. గతంలో జయసుధ కూడా ఈ స్థానం నుంచి గెలిచారు. అలాంటి చోట షర్మిల విజయం సునాయాసం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ లో చేరితే షర్మిల సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.













