షర్మిల విషయం లో కేసీఆర్ అనుకున్నది ఒకటి జరిగేది ఒకటా…?
తెలంగాణాలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వలన మాకు వచ్చే నష్టం ఏమీ లేదనేది తెరాస పార్టీ వేస్తున్న అంచనా… రాజకీయంగా తెరాస పార్టీని బలోపేతం చేసిన చాలా మంది నేతలు షర్మిలను చాలా తక్కువ అంచనా వేస్తూ ఆమె గురించి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఆంధ్రా పార్టీ కదా తెలంగాణాలో ప్రభావం చూపిస్తుందా…? చూపిస్తే రెడ్డి సామాజిక వర్గమే కదా కాస్తో కాస్తూ దూరమయ్యేది అనే భావనలో అధికార తెరాస పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళ అంచనాలు కూడా తప్పు అని అనలేం.
ఎందుకంటే వైఎస్ అభిమానులు చాలా మంది కాంగ్రెస్ లోనే ఉన్నారు… అందుకే షర్మిల కూడా ఆ పార్టీ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల మీద దృష్టి పెట్టారని అంటున్నారు. మరి తెరాస పార్టీకి జరిగే నష్టం గురించి ఆ పార్టీ ఆలోచన చేసిందా…? ఎంత మాత్రం లేదు గుడ్డి నమ్మకంతో ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. షర్మిలకు కోపం ఉంటే జగన్ మీద చూపించాలి గాని తెలంగాణా వచ్చి కేసీఆర్ మీద చూపించడమే అసలు వింత… షర్మిలను కేసీఆర్ ఎంత వరకు విపక్షాలను దెబ్బ కొట్టడానికి వాడుకుంటారో గాని… బిజెపి మాత్రం పక్కాగా ఆమెను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు.
కేసీఆర్ తో జగన్ కు ఉన్న అవసరం కంటే జగన్ కు బిజెపితో ఉన్న అవసరమే ఎక్కువ. షర్మిల కూడా పలు కేసులతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాట ఆమె కాదనలేకపోవచ్చు. అందుకే సైలెంట్ గా తెరాస ను దెబ్బ కొట్టవచ్చు. ఇప్పుడు మూడు జిల్లాల మీద ఆమె ఫోకస్ పెట్టినా… భవిష్యత్తులో అక్కడి వరకు ఆమె ఆగకపోవచ్చు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తెరాసలోనే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఎక్కువ. పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి మొదలుపెడితే జిల్లా కమిటీల వరకు తెరాసలో రెడ్ల ఆధిపత్యం ఉంది.
కాంగ్రెస్ కనుమరుగు అవుతుందని భావించిన చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు తెరాసలోకి వెళ్లి కేసీఆర్ కు దగ్గరయ్యారు. ఇక బిజెపి మీద కోపం ఉన్న క్రైస్తవులు కూడా కేసీఆర్ కే మద్దతు ఇచ్చారని చెప్పాలి. బిజెపిని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా ఉండాలంటే … కాంగ్రెస్ కంటే కూడా కేసీఆర్ వల్లనే అవుతుందనే భావన క్రైస్తవులు వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం గాని క్రైస్తవ సామాజిక వర్గం గాని తెరాస అంచనా వేసినంత బలంగా కాంగ్రెస్ లో లేదు. తెరాసకే వాళ్ళు సానుకూలంగా ఉన్నారు.
షర్మిల మూడు జిల్లాలను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణంగా అదే అయి ఉండవచ్చు. ఆంధ్రా ప్రభావం ఉండే మూడు జిల్లాల నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువ. కాబట్టి షర్మిలను తక్కువ అంచనా వేస్తే నష్టపోయేది తెరాస పార్టీ. క్రైస్తవులు, రెడ్డి సామాజిక వర్గ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా కూడా ఆమెకు మద్దతు ఇస్తే… ఈ మూడు జిల్లాల్లో విపక్షాలకే ఎక్కువ లాభం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి దీని మీద కేసీఆర్ ఫోకస్ పెడతారో లేదో చూడాలి.













