కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం ఉందా..? లేదా..?
తెలంగాణలో రాజన్నరాజ్యం తీసుకురావాలనే ఆకాంక్షతో ఇక్కడ పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. తన తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో అమలు చేసిన పథకాలు తప్పకుండా తనకు మేలు చేస్తాయని.. ఆయన్ను అభిమానించే నేతలు తన వైపు వస్తారని షర్మిల ఆశించారు. అయితే ఆ కోరిక నెరవేరలేదు. దీంతో ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ ఇదిగో అదిగో అన్నట్టే సాగుతోంది. కానీ ముందుకు మాత్రం వెళ్లట్లేదు. దీంతో విలీన ప్రక్రియ ఉంటుందా.. ఉండదా.. అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. రెండు మూడు రోజులపాటు ఆమె ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ముఖ్యంగా పార్టీ విలీన ప్రక్రియ కోసమే ఆమె ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయి విలీనంపై ఒక క్లారిటీ తీసుకువస్తారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య అంగీకారం కుదిరితే ఈ నెల 30లోపే విలీన ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ టర్మ్స్ కుదరకపోతే విలీన ప్రక్రియ ఉండకపోవచ్చని కూడా సమాచారం. అదే జరిగితే ఎవరి దారి వాళ్లు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
తెలంగాణలో తాను అనుకున్నంత మైలేజ్ రాకపోవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల నిర్ణయించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో 90శాతం మంది షర్మిల పార్టీని విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేసుకున్నారని.. అలాంటప్పుడు ఆయన బిడ్డ షర్మిలను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాదిస్తున్నారు. అవసరమైతే షర్మిల సేవలను ఏపీలో వాడుకోవాలని సూచిస్తున్నారు. షర్మిల వల్ల తెలంగాణలో మేలు కంటే కీడే ఎక్కువనేది టీపీసీసీ నేతల వాదన. అందుకే హైకమాండ్ డైలమాలో పడింది. ఆమెను ఎక్కడ వాడుకోవాలనేదానిపై తర్జన భర్జన పడుతోంది.
హైకమాండ్ కు అత్యంత సన్నిహితుడైన డీకే శివకుమార్ ద్వారా షర్మిల పావులు కదిపారు. అంతేకాక వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబం గాంధీ ఫ్యామిలీపై నెగెటివ్ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆయన బిడ్డ కాంగ్రెస్ లో చేరతానంటే స్వాగతించడం ద్వారా తమపై పడిన ముద్రను తొలగించుకోవాలని ఆ ఫ్యామిలీ చూస్తోంది. అందుకే షర్మిలను ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని డిసైడయ్యారు. అయితే తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తుండడంతో విలీన ప్రక్రియ రోజురోజుకూ ఆలస్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఇక లేట్ చేయకుండా విలీనం ముగించాలని ఆమె కోరుకుంటోంది. ఒకవేళ అలా కుదరకపోతే తన దారి తాను చూసుకోవాలనుకుంటోది. ఏదేమైనా ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.













