టార్గెట్ రీచ్ అయిన షర్మిల.. ఫుల్ జోష్..!
తెలంగాణలో రాజన్నరాజ్యం తేవడమే లక్ష్యమంటూ వై.ఎస్.తనయ షర్మిల ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా ఆత్మీయ సమావేశాలు పూర్తి చేసిన షర్మిల ఇటీవలే ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఘనంగానే నిర్వహించారు. అదే రోజు నిరుద్యోగంపై పోరాటం చేస్తానని షర్మిల ప్రకటించారు. మూడు రోజులపాటు దీక్ష చేస్తానని చెప్పారు. చెప్పినట్లే 15వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ లో దీక్షకు కూర్చున్నారు. అయితే ఆమె దీక్షకు పోలీసులు ఒకరోజు మాత్రమే అనుమతించారు.
ఇందిరాపార్క్ వద్ద దీక్ష పూర్తయ్యేలోపు మరో రెండ్రోజుల పొడిగింపు కోసం షర్మిల అనుచరులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపై విచారణ జరగకపోవడంతో సాయంత్రానికి గడువు ముగిసింది. దీంతో శిబిరాన్ని ఖాళీ చేయాలని షర్మిలను ఆదేశించారు. శిబిరాన్ని ఖాళీ చేసేందుకు షర్మిల అంగీకరించి.. పాదయాత్ర ద్వారా లోటస్ పాండ్ కు వెళ్లాలని నిర్ణయించారు. అక్కడి నుంచి బయలుదేరారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్దకు వచ్చాక ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ షర్మిల అనుచరులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకోవడం మొదలు పెట్టారు.
షర్మిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో షర్మిల చేతికి స్వల్ప గాయమైంది. షర్మిలను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి లోటస్ పాండ్ కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. దీంతో షర్మిల లోటస్ పాండ్ వద్దే దీక్షను కంటిన్యూ చేశారు. దీక్షకోసం అప్పటికే లోటస్ పాండ్ వద్ద స్టేజ్ పూర్తి చేశారు అనుచరులు. అప్పటి నుంచి ఇప్పటివరకూ షర్మిల అక్కడే దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. తాను అనుకున్న లక్ష్యం పూర్తయినట్లేనని షర్మిల భావిస్తున్నారు.
ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పర్మిషన్ ఇచ్చి ఉంటే ఇంత మైలేజ్ రాకపోవచ్చని షర్మిల అనుచరులు భావిస్తున్నారు. అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పడం వల్లే పాదయాత్ర చేయాల్సి రావడం, అరెస్టు కావడం.. లాంటి హంగామా జరిగింది. ఇదంతా తమకు మేలే చేసిందని షర్మిల అభిమానులు భావిస్తున్నారు. లోటస్ పాండ్ వద్ద కూడా షర్మిల కేసీఆర్ నే నేరుగా టార్గెట్ చేసి మాట్లాడారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. అంతేకాక.. ఏనాటికైనా తెలంగాణకు సీఎం అవుతానని ధీమాగా చెప్పారు. మామూలుగా దీక్ష చేసి ఉన్నట్టయితే ఇంత పెద్ద మైలేజ్ వచ్చి ఉండేది కాదనుకుంటున్న షర్మిల.. ఇప్పుడు మాత్రం అనుకోని ఇమేజ్ వచ్చిందని సంబరపడుతున్నారట. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ కేడర్ ని మందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.













