షర్మిల దూకుడు..! జెండా, అజెండా రెడీ?
తెలంగాణలో పార్టీ స్థాపన దిశగా వడివడిగా అడుగులేస్తున్న వై.ఎస్.షర్మిల దూకుడు పెంచారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ తదనుగుణంగా అడుగులేస్తున్నారు. ఏప్రిల్ లేదా జూన్ లో ఆమె పార్టీని అధికారికంగా అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈలోపే సంస్థాగతంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం పూర్తి చేయాలనుకుంటున్నారు.
షర్మిల పార్టీ ఏర్పాటుపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏర్పాటు క్రమంలోకానీ, ఆ తర్వాత కానీ తనకు ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే అంచనా వేస్తున్నారు. వాటికి సమాధానాలు సిద్ధం చేసుకుంటున్నారు. తాను తెలంగాణ వ్యక్తిని కాదంటూ వస్తున్న విమర్శలకు ఆమె ఇప్పటికే సమాధానమిచ్చారు. తాను తెలంగాణ కోడలినేనని.. తనకు ఈ గడ్డపై హక్కు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్, విజయశాంతిలది తెలంగాణాయేనా అని షర్మిల ప్రశ్నించారు. అంతేకాక.. తెలంగాణ యాస, భాషపై కూడా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.
మరోవైపు పార్టీని అధికారికంగా ప్రకటించేనాటికే సంస్థాగతంగా నిర్మాణం పూర్తి చేయాలనుకుంటోంది షర్మిల. తద్వారా పార్టీ అనౌన్స్ చేసేటప్పటికే పూర్తిస్థాయి యంత్రాంగం తమకు అందుబాటులో ఉంటుందని భావిస్తోంది. సహజంగా పార్టీ ఏర్పాటు తర్వాతే జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే షర్మిల ఇందుకు భిన్నంగా అడుగులేస్తున్నారు. ముందుగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రతి మండలానికి ముగ్గురితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను తన ముఖ్య అనుచరుడైన పిట్టా రామ్ రెడ్డికి అప్పగించారు.
ఇది ఓ వైపు కొనసాగుతుండగానే.. పార్టీ విధివిధానాలు, జండా లాంటి అంశాలను ఖరారు చేసేందుకు కూడా షర్మిల స్ట్రాటజిక్ కమిటీని ఏర్పాటు చేశారు. వై.ఎస్.తో అనుబంధం కలిగిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సన్నిహుతులు, రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు ఇందులో ఉన్నారు. జెండాలో నాలుగు రంగులు ఉండాలని ప్రాథమికంగా సూత్రీకరించారు. తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో ఈ జెండా ఉండే అవకాశం ఉంది. వచ్చే వారానికంతా జెండాకు తుది మెరుగులు దిద్దనున్నారు. అలాగే రెండు వారాల్లో పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు పూర్తి కానున్నాయి.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతున్నందున జిల్లాలవారీగా సమావేశాల్లో స్పీడ్ పెంచనున్నారు షర్మిల. లోటస్ పాండ్ దగ్గర మీటింగ్ లు పెడ్తున్నందున కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ లతో చుట్టుపక్కల వాళ్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో లోటస్ పాండ్ లో ఇకపై చిన్న చిన్న మీటింగ్ లు మాత్రమే ఏర్పాటు చేసి.. జిల్లాలకే వెళ్లి ఆత్మీయులతో సమావేశం కావాలని షర్మిల నిర్ణయించారు. అవసరమైతే మరో ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.













