తెలంగాణ కోసం ఎందాకైనా..! దీక్షలే షర్మిల అస్త్రాలు..!!
షర్మిల పాలిటిక్స్ లోకి వస్తున్నట్టు చెప్పేసింది. అయితే అందరూ ఊహించినట్టు పార్టీకి సంబంధించిన విధివిధానాలేవీ వెల్లడించలేదు. జులై 8న పార్టీ పేరు, జెండా, అజెండా లాంటి వివరాలను వెల్లడిస్తానని షర్మిల చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన ప్రజా సంకల్ప సభలో షర్మిల తన రాజకీయ ప్రవేశానికి కారణమేంటో చెప్పేశారు. ఇందుకోసం ఆమె భారీగానే కసరత్తు చేసినట్లు అర్థమవుతోంది. తెలంగాణ ప్రజలు తనను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్న షర్మిల.. వారికోసం ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేశారు.
ఖమ్మం సభలోనే పార్టీకి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడిస్తారని ముందునుంచి ఊహించారు. అయితే అలాంటివేం చేయలేదు. కేవలం తన రాజకీయ ఆరంగేట్రానికి కారణాలను మాత్రమే షర్మిల వివరించారు. ఈసందర్భంగా అధికార పార్టీని ప్రధానంగా టార్గెట్ చేశారు. కేజీ నుంచి పీజీ విద్య ఏమైందని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఏమైపోయారని నిలదీశారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్న ఆమె.. వారికోసం ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం చేశారు. ఇకపై ఒక్క నిరుద్యోగి కూడా ఆత్మహత్య చేసుకోకూడదని చెప్పారు. వారికోసం తాను అండగా ఉంటానన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు షర్మిల. ఈ నెల 15 నుంచి మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేయబోతున్నట్టు షర్మిల ప్రకటించారు. ఆ తర్వాత జిల్లాల్లో కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపడతారని వెల్లడించారు.
పార్టీ ప్రకటనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈ లోపు ప్రజల్లోకి బలంగా వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. ఇందుకోసం ముఖ్యంగా నిరుద్యోగులను లక్ష్యంగా ఎంచుకున్నారు. వారిలోని అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆమె నిరుద్యోగులకు అండగా నిరాహారదీక్షలు మొదలు పెడుతున్నట్టు సమాచారం. గతంలో వైసీపీ కూడా ఇలాంటి దీక్షలతోనే ప్రజల ముందుకు వెళ్లింది. ఆయా అంశాలపై జగన్ ఒక్కరోజు పాటు వివిధ ప్రాంతాల్లో దీక్షలు చేసేవారు. ఇప్పుడు షర్మిల కూడా జగన్ బాటలోనే దీక్షలను అస్త్రాలుగా ఎంచుకున్నారు.
తాను ఎవరో పంపితే రాలేదని షర్మిల స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు, ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు పార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఎవరేమనుకున్నా తాను తెలంగాణ బిడ్డనేనని తేల్చి చెప్పారు. వారికోసం ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. రానున్న రోజుల్లో ఈ గడ్డపై నిలబడి ప్రజల కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. మరోవైపు తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నానని.. ఆశీర్వదించాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.













