కేసీఆర్ ఎందుకు డల్ అయిపోయారు..? మౌనం వెనుక వ్యూహమేంటి?
ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీల వల్ల ఒరిగిందేమీ లేదని, తాను అధికారంలోకి వస్తే దేశం గతిని మార్చేస్తానంటూ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు కేసీఆర్. ఉద్యమ పార్టీగా ఎంతో పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి – టీఆర్ఎస్ పేరు మార్చేసి దేశం కోసమంటూ దాన్ని భారత్ రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ గా మార్చేశారు. 70 ఏళ్లకు పైగా కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశాన్ని పరిపాలించాయని.. కానీ ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కూడా లేవని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనున్న చైనా అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుంటే మనమేమో గుండు సూదికి కూడా ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితి పోవాలంటే ఢిల్లీలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.
బీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు ఇక ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా విస్తృతంగా తిరిగి పార్టీని విస్తరింపజేస్తానని, అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసి మూడో వేదికను తయారు చేస్తానని, థర్డ్ ఫ్రంటే అధికారంలోకి వస్తుందని ఢంకా బజాయించారు. కేసీఆర్ ఊపు, ఉత్సాహం చూస్తే ఢిల్లీలో నిజంగానే ఇది సాకారమవుతుందేమో అని అందరూ అనుకున్నారు. మొదటి మూడు నెలలు ఫుల్లుగా హడావుడి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పలువురు నేతలు వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ అయితేనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కరెక్ట్ మొగుడని అందరూ ఊదరగొట్టారు.
కానీ ఏమైందో ఏమో కేసీఆర్ ఇప్పుడు కామ్ అయిపోయారు. పెద్దగా యాక్టివ్ గా లేరు. ఢిల్లీలోనే మకాం వేసి అందరినీ ఏకం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ప్రగతి భవన్ దాటి బయటకు కూడా రావట్లేదు. పార్టీ విస్తరణ కార్యక్రమాలు కూడా పెద్దగా ఉండట్లేదు. ఒక్క మహారాష్ట్రలోనే కాస్త కదలిక కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల జోలికి కూడా వెళ్లట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా కేసీఆర్ ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారనేది అంతు చిక్కడం లేదు. పార్టీ నేతలు కూడా కేసీఆర్ మౌనానికి అర్థమేంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం పులి మౌనంగా ఉందంటే వేటకు సిద్ధమవుతోందని అర్థమంటూ కొత్త భాష్యం చెప్తున్నారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితను ఈడీ విచారించడంతో కేసీఆర్ కాస్త వెనక్కు తగ్గారని కొందరు చెప్తున్నారు. కేసీఆర్ స్పీడ్ తగ్గించిన తర్వాత బీజేపీ కూడా కాస్త స్లో అయిందని.. ఇద్దరూ వ్యూహాత్మకంగా కాస్త వెనకడుగు వేసి ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఒకరు ముందడుగు వేస్తే మిగిలిన వాళ్లు కూడా స్పీడ్ పెంచే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి.. మున్ముందు ఏం జరుగుతుందో..!













