వరంగల్ తూర్పు రారాజెవరు…?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా నడుస్తోంది. వరంగల్ తూర్పు నుంచి నరేందర్, సురేఖ, ప్రదీప్ రావు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గంలో పద్మశాలి, కాపు, ఎస్సీ, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండగా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముగ్గురు క్యాండిడేట్లు నియోజకవర్గంలో సొంత ఇమేజ్ సంపాదించుకున్నవారే.
నియోజకవర్గంలో పార్టీ నుంచి సహకారం లేకున్నా, వెంట నడిచిన వారు పార్టీ వీడుతున్నా తనకున్న అనుభవంతో నరేందర్ ఒంటరి పోరు చేస్తున్నారు. నన్నపునేని నరేందర్.. ద్వితీయ శ్రేణి నేతలను నయానో భయానో తనతో నడిచేలా చేస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.. తాను గెలిస్తే డబుల్ బెడ్ రూమ్ సహా పలు సంక్షేమపథకాల్లో అవకాశమిస్తానంటూ… ఆ నేతలకు ఆశ చూపి, తనతో పాటు ఉండేలా చూసుకుంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.. కేసీఆర్ సర్కారు వ్యతిరేకతకు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నరేందర్‌కు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది.
తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ లో పెద్ద లీడర్లు ఉన్నా నరేందర్ ఒంటరి అయ్యారు. ఇక కొండా దంపతులు గతంలో తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో నాటి క్యాడర్‌ను తిరిగి తమ గూటికి తెస్తున్నారు. కాంగ్రెస్ హవాను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలను తమ వైపు తిప్పుకుంటున్నారు. సురేఖ భర్త మురళీ గెలుపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాకతో క్యాడర్లో మరింత జోష్ వచ్చింది. ఈ ఇద్దరితో పోలీస్తే బీజేపీ అభ్యర్థి ప్రదీప్ రావుకు సౌమ్యుడిగా పేరుంది.
జనాలు తనను సులభంగా కలిసేలా చూసుకుంటారు. యూత్ లో, ఓటర్లలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ముస్లిం ఓటర్లు బీజేపీ అంటే కొంత వ్యతిరేకత చూపే అవకాశమున్నా మిగతా ఇద్దరు వాటిని చీల్చే క్రమంలో తనకు ఇబ్బంది ఉండదని ప్రదీప్ భావిస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుకూలంగా ఉండడంతో ఎస్సీ ఓట్లు తనకు లాభం చేకూరుస్తాయనే ధీమాతో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా దంపతుల మధ్య 30 ఏండ్లుగా శత్రుత్వం నడుస్తోంది. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు తమ ఆధిపత్యం చూపే ప్రయత్నం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు దయాకర్ రావు కావాలనే కొండా మురళిని అరెస్టు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎర్రబెల్లి నుంచి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతోనే నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుషులకు దగ్గరయ్యారు.వైఎస్ ప్రభుత్వంలో ఆయన భార్య సురేఖ మంత్రిగా పనిచేశారు.
ఈ క్రమంలో వారికి దయాకర్ రావు సోదరునిగా ప్రదీప్ రావుతో కూడా అంతే గ్యాప్ వచ్చింది. రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్.. కొండా సురేఖ, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కన్నా చాలా జూనియర్. ఈ ఇద్దరి సహకారంతోనే రాజకీయంగా ఆయన ఎదిగారు. టీడీపీలో సీనియర్‌గా ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నపుడు ఆయన మద్దతుతో నరేందర్ టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత గ్రేటర్ మేయర్, తూర్పు ఎమ్మెల్యే అయ్యారు. కొండా దంపతులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నరేందర్ వారికి దగ్గరగా మెదిలాడు. తర్వాత దయాకర్ రావు బీఆర్ఎస్లో చేరడంతో కొండా దంపతులు బీఆర్ఎస్ను వీడారు. కాగా, అప్పటివరకు సీనియర్ గా ఉన్న కొండా దంపతులను నన్నపునేని శత్రువుగా చూడడం మొదలుపెట్టారు. తాను ఎమ్మెల్యే అయ్యాక వారిపై వ్యక్తిగత దూషణలకు దిగారు.













