కేటీఆర్ గారూ.. వైజాగ్ రండి..! ఉక్కు నేతల ఆహ్వానం
విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ఊపందుకుంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా అన్ని అస్త్రాలను మోహరించేందుకు సిద్ధమయ్యారు కార్మికులు. ఈ నెలాఖరు నుంచి సమ్మె నోటీసు కూడా అందించారు.
ఓ వైపు కార్మికుల ఉద్యమానికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఏపీలోని అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఉద్యమానికి మద్దతించ్చింది. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. నేతలు కార్మికుల దగ్గరకు వెళ్లి మద్దతు ప్రకటిస్తున్నారు కూడా.!
ఏపీలో జరుగుతున్న ఈ ఉద్యమానికి అనూహ్యంగా తెలంగాణ నుంచి మద్దతు లభించింది. సాక్షాత్తూ మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు. అవసరమైతే విశాఖకు వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమకారులను కలుస్తామని కూడా చెప్పారు. దీంతో ఉద్యమానికి మరింత ఊపు లభించినట్లయింది. ఏపీ సర్కార్ కంటే టీఆర్ఎస్ సర్కార్ ఎంతో బెటర్ అంటూ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
కేటీఆర్ మద్దతుతో ఆనందం వ్యక్తం చేసిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు మంత్రి రాజశేఖర్, గంధం చంద్రుడు హైదరాబాద్లో ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. నేరుగా ఆయన్ను కలిసి విశాఖ రావాల్సిందిగా ఆహ్వానించారు. తాము చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు ప్రత్యక్ష మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దీనికి ఆయన సమ్మతించినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ విశాఖకు వెళ్తే మాత్రం ఉద్యమం మరింత ఊపందుకోవడం ఖాయమని భావిస్తున్నారు.













