బీసీ ఓట్లే అజెండా..
బీఆర్ఎస్ సర్కార్ ఎన్నికల అస్త్రాలను వరుసగా సంధిస్తోంది. ఎన్నికల ముందు ప్రజల్ని ఆకర్షించేందుకు, ఆయావర్గాల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు ప్రణాళికలతో ముందుకెళుతోంది. తాజాగా బీసీలఓట్లే లక్ష్యంగా అడుగులేస్తోంది. బీసీల్లోని కులవృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతోనే అర్హుల ఎంపిక చేయాలని నిర్ణయించింది. రోజుకు కనీసం 50 యూనిట్లు గ్రౌండింగ్ చేసే లక్ష్యంతో పనిచేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు..
ఇప్పటికే మత్స్యకారులు, గొల్ల,కురుమలు.. ఇలా వివిధ వృత్తులకు సంబంధించిన వారికి…తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమపథకాలను అమలు చేస్తోంది. దీనికి తోడు వృత్తిదారులను ప్రోత్సహించాలన్నఉద్దేశంతో బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.లక్ష గ్రాంటు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంచిర్యాల జిల్లా నుంచి ఈపథకం ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద ప్రతినెలా ఎంపికచేసిన అర్హులకు స్థానిక ఎమ్మెల్యేలు 15న చెక్కులు పంపిణీ చేస్తారు.
ఎన్నికల సమయంలో జనంలోకి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు … ఎక్కడికక్కడ నిరసన సెగ తగులుతోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో లక్ష రూపాయల ఆర్థికసాయం పేరుతో మరో సంక్షేమపథకం అమలు చేస్తూ, జనంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల వేళ కులసంఘాలను మచ్చిక చేసుకోవడం ద్వారా వారి ఓట్లను భారీగా సాధించాలన్న ఆశయం కూడా కారుపార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీనికి తోడు జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదం అనే షరతు పెట్టారు. ఫలితంగా కారు పార్టీకి చెందిన కార్యకర్తలు, సానుభూతి పరులకే ఈపథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటు వేయకుంటే పథకం అమలు చేయమని బెదిరించే పరిస్థితి వస్తుందని ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలోనే బీసీలపై కేసీఆర్ సర్కార్ కు ప్రేమ పొంగిపొర్లుతుందని విపక్షాల్లోని బీసీనేతలు విమర్శిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ కు నిధులు, నిరుపేద బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఇతర అంశాలను పట్టించుకోని ప్రభుత్వం.. లక్ష రూపాయల ఆర్థికసాయం పేరుతో మరో డ్రామా మొదలు పెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఇప్పటికే దళితబంధు సహా పలు పథకాలు పెట్టి, వాటిని ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారని ఆరోపించారు.
ఇప్పటికి ఎంతమందికి ఈపథకం కింద లబ్ధి కలిగిందని ప్రశ్నించారు. నిజంగా బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి , శ్రద్ధ ఉంటే బీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి, వాటిని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాల్లోని బీసీ నేతలు కోరుతున్నారు. అలాగే బీసీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు మంచి చదువులు అందేలా వర్సిటీల్లో సదుపాయాలు కలిగించాలని సూచిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి పథకాలు ప్రకటించడం, కొద్దిమందికి అందించి చేతులు దులుపుకోవడం కేసీఆర్ సర్కార్ కు అలవాటేనని విమర్శిస్తున్నారు.













