మూడు స్థానాలూ టీఆర్ఎస్ ఖాతాలోకే
మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయదుంధుభి మోగించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ముగ్గురూ భారీ విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో పాటు, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరికి ఎంపీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ వి.నరసింహాచార్యులు సర్టిఫికెట్‌ను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ కంటే టీఆర్ఎస్ అభ్యర్థులు మూడింతలకు పైగా ఓట్లు సాధించారు. మొత్తం 117 ఓట్లు ఉండగా, 108 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్ర సభ్యుడు దొంతి మాధవరెడ్డి ఓటు చెల్లదని ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో చెల్లిన 107లో ఓట్లలో గెలుపు కోటా కింద 27 ఓట్లను నిర్థారించారు. టీఆర్ఎస్ అభ్యర్థులో బండా ప్రకాశ్‌కు 33 ఓట్లు, సంతోష్ కుమార్‌కు 32 ఓట్లు, ఒడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌కు కేవలం పది ఓట్లే లభించడంతో ఓటమి పాలయ్యారు. బరిలో ఉన్న నలుగురు అభ్యర్థులకూ మొదటి ప్రాధాన్యత ఓట్లే లభించాయి. ఈ గెలుపుతో రాజ్యసభలో టీఆర్ఎస్ బలం రెట్టింపైంది. ప్రస్తుతం పెద్దల సభలో టీఆర్ఎస్కు ముగ్గురు ఎంపీలు ఉండగా, వారికి మరో ముగ్గురు తోడవడంతో ఆ సంఖ్య ఆరుకు చేరుకుంది.













