తెలంగాణ సెంటిమెంట్.. రేవంత్ రెడ్డికి కత్తిమీద సామే!
తెలంగాణ ఏర్పడి పన్నేండేళ్లయింది. రాష్ట్రంలో పరిపాలన, ప్రజా సమస్యలు, ప్రగతిపై నిర్మాణాత్మక చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని శాసించిన ప్రాంతీయ సెంటిమెంట్ మరోసారి తెరపైకి వస్తోంది. నిన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆంధ్ర-తెలంగాణ భావోద్వేగాలను రగిల్చేందుకు తెరవెనుక రాజకీయ వ్యూహాలు ముమ్మరమవడమే దీనికి ప్రధాన కారణం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా కోల్పోయిన వైభవాన్ని, ఉనికిని మళ్లీ చాటుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలను లేవనెత్తి ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నించినప్పటికీ, ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి కొత్త ఆయుధాన్ని అందించాయి.
ముఖ్యంగా, పొరుగు రాష్ట్రమైన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి సారించడం, జూన్ 2న తెలంగాణలో నిర్వహించిన సమావేశం వంటి పరిణామాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. పవన్ పర్యటనను, ఆయన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని, తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కొత్త సెంటిమెంట్ ఉద్యమాన్ని లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తద్వారా ప్రజల్లో మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను బలపరిచి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఆ పార్టీ అంతర్గత వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ సెంటిమెంట్ వేడి కేవలం విపక్షాలకే పరిమితం కాలేదు, అధికార కాంగ్రెస్ పార్టీలోనూ దీని సెగలు తగులుతున్నాయి. పార్టీ లైన్‌కు భిన్నంగా అనిరుధ్ రెడ్డి, మందుల సామ్యూల్ వంటి కాంగ్రెస్ నేతలు ఏపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరు కూడా ప్రాంతీయ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలని చూడటం అధిష్టానానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో అత్యంత వ్యూహాత్మకంగా, సమతుల్యతతో అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ సెంటిమెంట్ గనుక మళ్లీ బలపడితే, ఆ సెంటిమెంట్‌కు పేటెంట్ హక్కు కలిగిన బీఆర్ఎస్కే అంతిమంగా రాజకీయంగా లాభం చేకూరుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించింది కేవలం సెంటిమెంట్ కోసం కాదు.., మార్పు, బాధ్యతాయుతమైన పరిపాలన కోసమనేది రేవంత్ రెడ్డి అవగాహన.
ఈ సెంటిమెంట్ ఉచ్చులో పడితే కాంగ్రెస్ ప్రభుత్వం తన అభివృద్ధి అజెండాను పక్కన పెట్టాల్సి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఏపీతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలనే ధోరణితో ఆయన ఉన్నారు. అయితే, సొంత పార్టీ నేతల నియంత్రణ లేని వ్యాఖ్యలను అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఏపీ నేతలపై, పొరుగు రాష్ట్ర వ్యవహారాలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా సొంత పార్టీ నేతలకు పగ్గాలు వేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మొదటికే మోసం రావచ్చు. బీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్‌ను కేవలం ఒక పొరుగు రాష్ట్ర నేత పర్యటనగా మాత్రమే పరిగణించాలనేది రేవంత్ వ్యూహం కాగా, దాన్నే పెద్ద ఆయుధంగా మార్చుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ సెంటిమెంట్ అనేది ఎప్పుడూ రెండంచుల కత్తి లాంటిదే. సీఎం రేవంత్ రెడ్డి ఈ సెంటిమెంట్ అలలను సమర్థవంతంగా అడ్డుకుని, అభివృద్ధి అజెండాను నిలబెట్టుకోగలిగితేనే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా సాగుతుంది. ఒకవేళ సొంత పార్టీ నేతలను అదుపు చేయడంలో విఫలమైతే, అది పరోక్షంగా బీఆర్ఎస్కు పొలిటికల్ ఆక్సిజన్ అందించినట్లే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.








