చంద్రబాబు అరెస్టుపై…
చంద్రబాబు అరెస్టు వ్యవహారం తెలంగాణలోనూ ప్రకంపనలు రేపుతోంది. నిన్నటివరకూ పొరుగు రాష్ట్ర విపక్షనేత అరెస్టుతో .. తెలంగాణకు ఏం సంబంధమన్న బీఆర్ఎస్ నేతలు ఒకొక్కరుగా స్పందిస్తున్నారు. అయితే నేరుగా చంద్రబాబు అరెస్టును తప్పు పట్టకున్నా.. ఈ వయసులో అరెస్ట్ విచారకరమన్నారు మంత్రి హరీశ్ రావు. చంద్రబాబు హయాంలో మంత్రిగా చేశానని గుర్తు చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. ఇది విచారకరమైన విషయమన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు అధికారం శాశ్వతం కాదన్నారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విచారకరమన్నారు తలసాని.
ఇంకా చాలా మంది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు .. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, తుమ్మల నాగేశ్వరరావు .. నేరుగా అరెస్టుపై స్పందించారు. ప్రతీకార రాజకీయాలు సరికావన్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం పరోక్షంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తామంటే.. శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితి ఉంటుందని మంత్రి కేటీఆర్ అనడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు.. జాతీయస్థాయి నాయకుడన్న రేవంత్.. ర్యాలీలకు అనుమతివ్వకపోవడం ఏంటన్నారు.
ఇక ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు సైతం.. చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేశారు. ఏపీ నేతలు స్పందించకున్నా.. బండిసంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి .. ఇలా నేతలు ఎవరికి వీలైనట్లు వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొన్నిరోజుల క్రితం ఎలాంటి నోటీసివ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిసిందని బండి సంజయ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి. హైదరాబాద్ సహా పలుప్రాంతాల్లోపెద్దసంఖ్యలో సెటిలర్లు ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. ఈక్రమంలోవారికి ఎక్కడ బాధ కలుగుతుందో.. ఆ ఓట్లు ఏమవుతాయోఅన్న భయం పార్టీల్లో కనిపిస్తోంది. దీంతోనే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి.. ఒకొక్క పార్టీ నుంచి నేతలు … తమవంతుగా ప్రకటనలిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు… తెలంగాణలోని టీడీపీ నేతలు సైతం.. ఈఘటనపై ఆగ్రహంగా ఉన్నారు. కక్షగట్టి తమనేతను అరెస్ట్ చేసి, జైల్లోవేశారని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని ఇప్పటికే ఆరోపించారు. దీంతో సెటిలర్ల ఆగ్రహం, అనుగహ్రం ఏపార్టీ వేపు ఉంటుందో అన్న ఆందోళనలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి.













