తైవాన్ పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యం : కేటీఆర్
తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్, ఇంధన నిల్వ పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో వారు తరలిరావాలని కోరారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్రాధాన్యమిస్తామన్నారు. పెట్టుబడుల భారత్ (ఇన్వెస్ట్ ఇండియా) ఆధ్వర్యంలో తైవాన్, తెలంగాణ మధ్య దృశ్యమాధ్యమ సమావేశం జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ, తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యముంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పరిశ్రమలు నిర్వహిస్తున్నాయి. తైవాన్ పెట్టుబడుల సమీకరణ కోసం నేను 2015లో ఆ దేశంలో పర్యటించగా భారీ ఎత్తున స్పందన లభించిందని కేటీఆర్ తెలిపారు. ఆ దేశానికి చెందిన టీసీఏతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.
భారత్ తైవాన్ అంకురాల వేదికను ఏర్పాటు చేసుకున్న ఏకైక దేశీయ నగరం హైదరాబాద్. ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన అభివృద్ధి రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా తైవాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. వారు తెలంగాణ పర్యటనకు రాగానే పారిశ్రామిక పార్కు స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు.













