విభేదాల పర్వం…
రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. ఎవరి పంథా వారు అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. నూతన అసెంబ్లీలో పూజల సందర్భంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సమావేశం కావడం తదితర పరిణామాలతో వీరిద్దరి మధ్య సఖ్యత ఏర్పడిందని అందరూ భావించినా అది ఆఒక్క సమావేశానికే పరిమితమైంది. అయితే ఇప్పటికీ పలు కీలక బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. దీనికి తోడు తాజాగా నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదన వివాదానికి కారణమవుతోంది.
గతంలోనూ విభేదాలు
గతంలో నామినేటెడ్ కోటాలో కౌశిక్‌రెడ్డిని తిరస్కరించిన గవర్నర్.. తాజాగా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లతో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆమోదించకపోవడం చర్చనీయాంశమవుతోంది. 2019 సెప్టెంబరు 8న గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంతో పలుసార్లు విభేదించారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ సీటు దగ్గర మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్ పరమైన అంశాలకు తోడు అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు, రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మొదట్లో ఆహ్వానించకపోవడం వంటి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ, మండలి ఏకగ్రీవ ఆమోదం అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన అధికశాతం బిల్లులను పెండింగులో పెట్టారు. కొన్నింటిని తిరస్కరించగా.. మరికొన్ని తిప్పిపంపారు. ఇంకొన్ని రాష్ట్రపతికి పంపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీతో పాటు.. కీలకమైన బిల్లులు కావడంతో.. ఇటీవల శాసనసభలో రెండో దఫా తీర్మానం చేసి పంపినవి సైతం పెండింగులోనే ఉన్నాయి. కీలకమైన ఆర్టీసీ బిల్లుకు మాత్రం ఆమోదం లభించింది.
నామినేటెడ్ గండం..
గతంలో కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా.. 171(5) అధికరణ కింద ఆయన సేవాకార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తీసుకొని.. మాజీ సభాపతి మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా.. కొన్ని రోజుల పరిశీలన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాజాగా నామినేటెడ్ కోటాలోని రెండు ఖాళీలను ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఎందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మంత్రిమండలి ఆమోదించి.. గవర్నర్‌కు పంపగా.. వీరిద్దరి పేర్లను తిరస్కరించడంతో మళ్లీ ఎంపిక వ్యవహారం మొదటికి వచ్చింది.
రాజ్‌భవన్ నుంచి సమాచారం అందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించారు. గతంలో కౌశిక్‌రెడ్డి పేరును తిరస్కరించిన తర్వాత రెండోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌కు పంపలేదు. ఆయనకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఇద్దరు అభ్యర్థులు కీలకమైన ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారు కావడంతో.. వారిని మార్చకూడదనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే మరోసారి మంత్రిమండలి సమావేశం నిర్వహించి, రెండోసారి వీరి పేర్లను పంపాలని.., గవర్నర్ నిర్దేశించిన నిబంధనల పరిధికి సంబంధించి సమాచారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.













