Revanth Reddy: తప్పంతా అల్లు అర్జున్‌దే..! మరోసారి రేవంత్ రెడ్డి క్లారిటీ..!!

అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) వ్యవహారం తెలంగాణలో ఇంకా ప్రకంపనలు కలిగిస్తూనే ఉంది. ఈ అంశాన్ని ఇవాళ అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది.. అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశారు.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ పరామర్శలు.. తనపై పెట్టిన పోస్టులు.. ఇలా అనేక అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. అల్లు అర్జున్ బాధ్యాతరాహిత్యం వల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఎంత సాయం చేసేందుకైనే ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం.. తెలంగాణ ప్రజల ప్రాణాలు తీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
పుష్ప 2 (Puspha 2) రిలీజ్ సందర్భంగా ప్రీరిలీజ్ షోకోసం సంధ్య థియేటర్ (Sandhya theatre) యాజమాన్యం పోలీసులకు 2న లేఖ రాసిందని సీఎం చెప్పారు. అయితే.. 3న పోలీసులు అనుమతి నిరాకరిస్తూ థియేటర్ యాజమాన్యానికి బదులిచ్చారు. అయినా 4న రాత్రి 9 గంటల సమయంలో హీరో, హీరోయిన్ సహా సినిమా టీం వచ్చిందని.. వస్తున్న సమయంలో హీరో కారు పైకెక్కి చేతులూపుతూ వచ్చారన్నారు. ఆ సమయంలో హీరోను చూసేందుకు జనం పెద్దఎత్తున ఎగబడడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఓ మహిళ మృతి చెందడం, ఓ బాలుడు స్పృహకోల్పోవడం జరిగిందని.. వాళ్లను వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారని రేవంత్ రెడ్డి వివరించారు. ఇంత జరిగిన తర్వాత కూడా హీరో థియేటర్లో కూర్చొని సినిమా చూశారన్నారు.
హీరోను ఇక్కడి నుంచి పంపించేయాలని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు చెప్తే వాళ్లు వినిపించుకోలేదన్నారు. చివరకు డీఎస్పీ నేరుగా హీరో దగ్గరకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లకపోతే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్తే అప్పుడు హీరో బయలు దేరారన్నారు. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ఆయన కార్ పైకెక్కి చేతులూపుతూ వెళ్లాడున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హీరోను ఏ11గా చేర్చారన్నారు. పది రోజుల తర్వాత హీరో ఇంటికి పోలీసులు వెళ్తే దురుసుగా ప్రవర్తించిన విషయం టీవీల్లో అందరూ చూసే ఉంటారని రేవంత్ రెడ్డి వివరించారు. చివరకు పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు తరలిస్తే ఆయన్ను అర్ధరాత్రి పంపించేయాలని ఫోన్లు చేశారన్నారు. అలా కుదురుతుందా అని ప్రశ్నించారు.
హీరో జైలు నుంచి రిలీజ్ అయి ఇంటికి వెళ్తే సినీ స్టార్లు అంతా పరుగులు పెట్టి పరామర్శించారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. ఆయనకేమైనా కాలు విరిగిందా.. కన్ను పోయిందా అని ప్రశ్నించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుణ్ణి కానీ ఈ సినిమా వాళ్లు ఎందుకు పరామర్శించలేదని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వమే ఆసుపత్రి ఖర్చులు భరిస్తోందని వివరించారు. ఇండస్ట్రీ (Cinema Industry) బాగుండాలనే ఉద్దేశంతోనే సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలకు (Benefit Show) అనుమతి ఇచ్చింది తమ ప్రభుత్వమేనని.. అలాగని తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో ఆటలాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనమతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతటి ఉత్పాతానికి కారణమైన హీరోను అరెస్టు చేస్తే కొంతమంది తనను తిడుతూ పోస్టులు పెట్టారని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.