ప్రాజెక్టుల అప్పగింతపై వివాదం..
కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జల్ శక్తిశాఖ ఆదేశాలు.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంతో చర్చల్లో మినిట్స్ ను సైతం జల్ శక్తి శాఖ విడుదల చేసింది. దీన్ని అన్నిపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఒప్పందం వల్ల నదీజలాలపై తెలంగాణ తన హక్కులను కోల్పోయే పరిస్థితి ఉందంటున్నాయి. అయితే ఇంతకూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నదెవరు అన్న అంశంలో మాత్రం స్పష్టత కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి .. ఈ పాపమంతా కేసీఆర్ సర్కార్ దే అని ఆరోపించారు.
ఏపీ పునర్విభజన చట్టం సమయంలో దీన్ని తయారు చేశారని.. ఈచట్టానికి కర్త, కర్మ అంతా కేసీఆర్ అని ఆరోపించారు. అప్పుడు ఒప్పందానికి మద్దతిచ్చి, ఇప్పుడు తమను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదలమని.. ఉభయసభల్లో చర్చకు ప్రవేశపెడతామన్నారు. చర్చలో ప్రభుత్వం తరపున తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటామని.. బీఆర్ఎస్ తరపున కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ అవసరమైన కవితను కూడా తెచ్చుకోవాలని సూచించారు. సభను 48 గంటల పాటు నిర్వహిస్తామని, విపక్షం కోరితే ఎన్నిగంటలైనా చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. అంతే కాదు రాష్ట్రం విభజన తర్వాత కూడా అపెక్స్ కమిటీ సమావేశాల్లో ఈ ఒప్పందానికి సాక్షాత్తూ కేసీఆర్ అంగీకరించారంటూ మినిట్స్ సహా లెక్కలు బయటపెట్టారు సీఎం రేవంత్. డేట్ టు డేట్ ఆధారాలతో బీఆర్ఎస్ ను ఎండగట్టారు. పాపాల భైరవుడు కేసీఆర్ ని ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించారు. తాము మాత్రం.. కృష్ణాజలాల్లో 50శాతం వాటా వచ్చేవరకూ.. అప్పగించమని కేంద్ర జల్ శక్తి శాఖ, అధికారులకు చెప్పేశామన్నారు రేవంత్. ఇది తేలకుంటే కోర్టులను ఆశ్రయిస్తామని సంకేతాలిచ్చారు.
మరోవైపు.. ఇవన్నీ కాకమ్మ కబుర్లని బీఆర్ఎస్ కొట్టిపడేసింది. కేంద్రం దగ్గర మోకరిల్లి, ఒప్పందం చేసుకుని.. ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆక్షేపించింది. సీఎం రేవంత్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామన్న హరీశ్ రావు.. సభలో దిమ్మదిరిగేలా జవాబిస్తామన్నారు. గతంలో తాము సవాల్ విసిరినప్పుడు ప్రిపేర్ కాలేదంటూ కాంగ్రెస్ నేతలు పారిపోయారన్నారు. తాము అలా కాదని కచ్చితంగా చర్చలో పాల్గొంటామన్నారు. ఏదేమైనా ఈ పరిణామ రాజకీయంగా కాక రేపుతోంది. ఇరుపార్టీలు తమ తప్పు లేదంటున్నాయి. తాము అంగీకరించలేదని పబ్లిగ్గా చెబుతున్నాయి. మరి ఇరుపార్టీలు అంగీకరించనప్పుడు.. ఈ ఒప్పందం ఎలా జరిగింది అన్నది ఓప్రశ్నైతే.. ఇప్పుడు కేంద్రం ప్రాజెక్టులను తీసుకుంటే పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్నగా మారింది.













