ప్రగతి రథచక్రం..
ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో 43,373 ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబర వాతావరణం కనిపిస్తోంది. ఆగస్టు-03 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ బిల్లు పాసయితే మాత్రం ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు.
మొన్నటికి మొన్న వీఆర్ఓలను.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆర్టీసీ ఉద్యోగులను .. ప్రభుత్వఉద్యోగులుగా మార్చనున్నారు. అయితే ఇది ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు తీసుకున్న నిర్ణయంగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగుల ఓట్లను సైతం .. గులాబీ పార్టీ దక్కించుకుంటుందన్న ఆశలు.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తున్నాయి.
సకలజనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కీలకపాత్ర పోషించారు. ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి సమ్మె చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తమ ఆశలు నెరవేరతాయని భావించారు. కానీ .. గులాబీ సర్కార్.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు.. వారి సమ్మె చేసినా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్టీసీ బస్సులను దశలవారీగా తగ్గిస్తూ వచ్చింది. మరికొన్నింటిని కొరియర్ సర్వీసుల్లోకి మార్చింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు కాస్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు.
ఎన్నికల ఏడాది కావడం, విపక్షాలు పుంజుకుంటుండడంతో… ప్రజల్ని ఆకర్షించేందుకు కేసీఆర్ సర్కార్ ఒక్కో అస్త్రాన్ని సంధిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగులపై కరుణ చూపింది. ఇంకేముంది ఎన్నికల సమయంలో వారిని ప్రచారపర్వంలో భాగస్వాములను చేసుకునే వీలు కల్పించుకుంది. ఇదే సమయంలో ఓ వైపు సంక్షేమ జపాన్ని పటిస్తూనే… వివిధవర్గాలను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఓటు బ్యాంకు కలిగిన వర్గాలపై వరాలు జల్లు కురిపిస్తోంది. సామాజికవర్గాల వారీగా ఓట్లను దక్కించుకునేందుకు.. ఆయా వర్గాలకు చెందిన మంత్రులకుబాధ్యతలు అప్పగించింది. సామాజికవర్గాలకు చెందిన పెద్దలతో సమావేశాలు పెట్టి, వారిని దరిచేర్చుకునేలా ప్రణాళికలు రూపొందించింది.













