పోటీ చేసేందుకు భయపడుతున్న బీజేపీ సీనియర్లు..!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పార్టీలన్నీ కదనరంగంలోకి దూకేశాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టలేదు. దరఖాస్తులు స్వీకరించినా వాటి వడపోత ఇంకా పూర్తి కాలేదు. చాలా మంది సీనియర్లు పోటీ చేసేందుకు ఆసక్తి కూడా చూపలేదు. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. వాళ్ల దృష్టంతా అసెంబ్లీ మీద కాకుండా లోక్ సభ పైన ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణపై బీజేపీ ఎన్నో హోప్స్ పెట్టుకుంది. ఈసారి కచ్చితంగా కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి వస్తామని నమ్మకంగా ఉండేది. కానీ కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మొత్తం రివర్స్ అయింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ రేసులో ముందుకొచ్చింది. బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది. పైగా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే కాంగ్రెస్ ప్రచారం బాగా పని చేసింది. కవిత అరెస్టు కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. దీంతో బీజేపీ కేడర్ మొత్తం పునరాలోచనలో పడింది. కేసీఆర్ పై కోపంతో పార్టీలో చేరిన నేతలంతా ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు. అందుకే వాళ్లంతా పోటీకి ఆసక్తి చూపించడం లేదు.
మరోవైపు బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించట్లేదు. పోటీ చేస్తే ఓడిపోతామనే భయమే ఇందుకు కారణం. బీజేపీకి ఓటేసినా, బీఆర్ఎస్ కు ఓటేసినా ఒక్కటే అనే ఫీలింగ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయనే భావన కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవడం కంటే.. మోదీ ఫోటో ముందు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు చాలా మంది నేతలు. మరికొందరు నేతలేమో బీజేపీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమని భావించి పక్కచూపులు చూస్తున్నారు. రేపోమాపో గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో సీనియర్లందరినీ అసెంబ్లీ బరిలో దించింది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో కూడా అదే ఫార్ములా అమలు చేయాలని డిసైడైంది. ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, లక్ష్మణ్ తదితరులందరినీ అసెంబ్లీలో పోటీ చేయాలని ఆదేశించింది. అయితే వీళ్లెవరూ అసెంబ్లీకి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో వీళ్లలో కొందరు లోక్ సభకు పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా అసెంబ్లీ కంటే లోక్ సభే బెటర్ అనుకుంటున్నారు. కానీ హైకమాండ్ మాత్రం వీళ్లను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు.













