హుటాహుటిన ఢిల్లీకి బండి సంజయ్..! ఏంటి సంగతి..?
తెలంగాణ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరు ఉంటారో.. ఎవరు పోతారో అస్సలు తెలియట్లేదు. తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దడంలో అధిష్టానం కూడా విఫలమవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీని ఇలాగే వదిలేస్తే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందుకే వీలైనంత త్వరగా తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దాలనుకుంటోంది అధిష్టానం. అందుకే టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని హుటాహుటిని ఢిల్లీ రమ్మని ఆదేశించింది. దీంతో ఆయన హస్తినలో వాలిపోయారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత వారం ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చారు. అధిష్టానం వాళ్లిద్దరినీ ఢిల్లీ పిలిపించి మాట్లాడింది. స్వయంగా అమిత్ షా వాళ్లతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. సాధారణంగా అమిత్ షా ఏదైనా విషయాన్ని చెప్పాలంటే నేతలెవరూ సాహసించరు. కానీ ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీలో అస్తవ్యస్త పరిస్థితిని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. అంతేకాదు.. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే తమ దారి తాము చూసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్లు అలా చెప్పేసరికి అమిత్ షాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకుని తనకు కొంచెం సమయం ఇవ్వాలని కోరారు. అప్పటి వరకూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. దీంతో వాళ్లిద్దరూ తలూపి హైదరాబాద్ వచ్చేశారు.
ఈటల, కోమటిరెడ్డి లేవనెత్తిన అంశాలు ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ తో తెరవెనుక ఒప్పందం, కవిత అరెస్టు కాకపోవడం లాంటి అంశాలు పార్టీని వెనక్కు నెట్టేశాయని వాళ్లు చెప్పేశారు. అంతేకాక, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కలుపుకుపోవడంలో సీనియర్లు విఫలమవుతున్నారని ఊదారహణలతో సహా వివరించారు. కేసీఆర్ లాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే ఇవన్నీ పక్కన పెట్టి పోరాడాలని, ఆ సత్తా పార్టీకి ఉందో లేదో చెప్పాలని డెడ్ లైన్ విధించారు. దీంతో పార్టీ పరంగా సంస్కరణలు అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే బండి సంజయ్ ను అమిత్ షా ఢిల్లీ పిలిపించారు.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ డీలా పడడం, బీఆర్ఎస్ తో లింకు పెట్టడం.. లాంటివి కమలానికి పెద్ద సమస్యగా మారాయి. అంతేకాక నాయకుల్లో విభేదాలు కూడా పార్టీని బజారుకీడుస్తున్నాయి. అందుకే సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు హైకమాండ్ నిర్ణయించింది. విభేదాలను పక్కన పెట్టి పనిచేసే నేతలకు మాత్రమే ఎన్నికల బాధ్యతలు అప్పగించాలనుకుంటోంది. అందులో భాగంగా బండి సంజయ్ కి కేబినెట్లో బెర్త్ కల్పించడం, ఈటల – కోమటిరెడ్డి లాంటి వాళ్లకు ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి వారం రోజుల్లోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.













