తెలంగాణ హస్తగతం..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. హస్తం ఓట్ల సునామీలో అధికార బీఆర్ఎస్ నేతలు కొట్టుకుపోయారు. కచ్చితంగా గెలుస్తారనుకున్న పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ప్రముఖనేతలు అడ్రస్ లేకుండాపోయారు. హంగ్ ఊహాగానాలను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లే కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. మొత్తంగా 64 సీట్లలో విజయదుందుభి మోగించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌లో గెలుపు సాధించారు. గాంధీభవన్ మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. అందరూ ఊహించినట్లుగానే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. ఈ రెండు జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అధిక్యం కనబర్చింది.అయితే.. హైదరాబాద్‌లోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకోగా..సెటిలర్లు, గ్రేటర్ హైదరాబాద్ వాసులు..గులాబీకి బాసటగా నిలిచారు.
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదం
ముఖ్యంగా మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలన్న నినాదం ప్రజల్లోకి బలంగా చేరింది. ఈ నినాదం ప్రజల్లోకి చేరిందన్నదానికన్నా.. ప్రజల్లోకి చేరేలా చేయడంలో కాంగ్రెస్ చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. ముఖ్యంగా గ్రామగ్రామాన ఈ నినాదం ప్రతిధ్వనించింది. ఎప్పుడైతే కాంగ్రెస్ నినాదం మార్మోగడం ప్రారంభించిందో…దీనికి కౌంటర్ వేసింది బీఆర్ఎస్. ఏం మార్పు కావాలంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌కు..మళ్లీ ఒక్కఛాన్స్ పేరుతో మోసపోవద్దని ప్రచారం చేసింది. అభివృద్ధి, సంక్షేమం తమనినాదమంటూ ప్రచారం హోరెత్తించింది.. అయితే ప్రజలు మాత్రం ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు.
ప్రభుత్వ వ్యతిరేకతను చీలనీయని కాంగ్రెస్
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ చాలా జాగ్రత్త తీసుకొంది. దాదాపు 50కిపైగా పౌర సంఘాలను తెలంగాణ విద్యావంతుల వేదిక ఛత్రం కిందకు తీసుకొచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించగలిగింది.బీఆర్ఎస్కు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లను పార్టీకి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడిరది. దీనికి తోడు కమ్యూనిస్టు పార్టీలు కూడా బీజేపీకి దూరం కావడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది.
సునీల్ కనుగోలు కీలకపాత్ర..
ఇక కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెరవెనుక సూత్రధారి సునీల్ కనుగోలు. దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ శిష్యుల్లో సునీల్ ఒకడు. 2024 ఎన్నికలపై ముందుగానే ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. సలహాదారునిగా సునీల్ కనుగోలును నియమించింది. అంతే రంగంలోకి దిగిన సునీల్ కనుగోలు.. తన వ్యూహాలకు పదును పెట్టారు. ముందుగా కాంగ్రెస్ ఎక్కడకెక్కడ గెలుస్తుంది..? ఎక్కడ కాస్త కష్టపడితే గెలుస్తుంది..? కాంగ్రెస్ ఓడే స్థానాలేంటి అన్న అంశాలను లెక్కతీశారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని, అనుసరించాల్సిన వ్యూహాల వరకూ పక్కాగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా దళిత, వెనకబడిన వర్గాల ఓట్లపై దృష్టి సారించిన కాంగ్రెస్.. ఆయా ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను గాలించి, ఎంపిక చేసింది. పోడుభూముల నుంచి ఇతర అంశాలపై పోరాటం చేస్తూ.. స్థానికుల్లో సానుభూతి సాధించింది. దాన్ని ఓట్లుగా మార్చుకోవడంలో విజయవంతమైంది.
ఓటరు తీర్పు కాంగ్రెస్ వైపు….
అలా అని విజయంకోసం ఎక్కడా షార్ట్కట్లు వెతకలేదు. ప్రజలకు ఈప్రభుత్వం ఏం చేసింది..? ఏం చేయలేదు..? ప్రజలకు ఏం కావాలి..? వారికి కాంగ్రెస్ గెలిస్తే ఏం చేయనుందన్న అంశంపై క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు.దశాబ్దాల కలను సాకారం చేసిన గులాబీ పార్టీని అక్కున చేర్చుకుని, పదేళ్లపాటు అధికారమిచ్చిన తెలంగాణ ఓటరు.. మరోసారి తన విచక్షణ ప్రదర్శించాడు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనను స్వాగతించారు. ఒక్కఛాన్స్ ప్లీజ్ అంటూ కాంగ్రెస్ విన్నపాన్ని మన్నించిన ఓటరు.. కాంగ్రెస్‌కు ఓటేశాడు. దీంతో కాంగ్రెస్ మ్యాజిక్ మార్క్ అందుకుంది. అంతే కాదు.. ఎక్కడ హంగ్ వస్తుందో… ఎక్కడ అభివృద్ధి కుంటుపడుతుందో అన్న భయాలను దూరం చేసేలా సింగిల్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టాడు.
కర్నాటక తరహా మోడల్..
ఇక కాంగ్రెస్ కర్నాటక మోడల్ మేనిఫెస్టో.. తెలంగాణ ప్రజల్ని విశేషంగా ప్రభావితం చేసింది. గృహలక్ష్మి, రైతు బంధు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల పెంపు సహా చాలా అంశాలను.. కాంగ్రెస్ నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అంతేకాదు.. ఆ పేపర్లను ఇంటింటికీ తీసుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశం.. కాంగ్రెస్‌కు పెద్ద ఎసెట్‌గా మారిందని చెప్పొచ్చు.
ఈ ఎన్నికల్లో మరో విశేషం.. పెద్దసంఖ్యలో యూత్ బరిలో నిలవడం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యనందిత విజయం సాధించారు. గద్దర్ కుమార్తె వెన్నెలపై గెలిచారు. నారాయణపేట నుంచి చిట్టెం పర్ణికా రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఓ వైద్యకళాశాలలో ఆమె పీజీ చేస్తున్నారు.
ఇక జనసేన ఎందుకు పోటీ చేసిందో తెలియదు.. బీజేపీతో ఎందుకు జతకట్టి బరిలో దిగిందో ఆ పార్టీ నేతలకు అర్థం కాని పరిస్థితి.. చాలాచోట్ల పోటీ చేసినా.. ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కని దుస్థితి గ్లాస్ పార్టీకి దాపురించింది. పవన్ కల్యాణ్ సైతం పెద్దగా అభ్యర్థుల తరపున ప్రచారం చేసింది లేదు. ఎలాగూ గెలవని దానికి ప్రచారమెందుకని పవన్ భావించారో.. లేక ఇంకేమైనా కారణాలున్నాయో తెలియదు కానీ.. ఎన్నికల్లో దిగి జనసేన మాత్రం పరువు పోగొట్టుకుందని చెప్పొచ్చు.
జోడో యాత్ర స్ఫూర్తితో…
రాహుల్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తోంది. జోడో స్ఫూర్తితో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ప్రత్యర్థిపై విజయమే లక్ష్యంగా అడుగులేశారు. దీనికి తోడు అధిష్టానం సైతం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చింది. పార్టీలో సమస్యలు రాకుండా ముందస్తుగా నేతలను పిలిపించి మాట్లాడిరది.దీంతో తమగురించి అధిష్టానం పట్టించుకుంటుందని.. తాము హైకమాండ్ దృష్టిలో ఉన్నామన్న ఆశ,ఆశయం వారిని ముందుకు నడిపించింది. దీంతో గతానికి భిన్నంగా తామంతా ఒకటే అన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు. నేతలు ఐక్యతారాగం పాడడంతో .. కార్యకర్తల్లో సైతం సంతోషం కనిపించింది.దీంతో ఈసారి తమ గెలుపు తథ్యమన్న భావనతో కసితో కష్టించి పనిచేశారు. రాహుల్, ప్రియాంక, రేవంత్ సారథ్యంలో పార్టీని గెలిపించారు.
రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ..
2018లో కాంగ్రెస్ ఓటమికి.. 2024లో కాంగ్రెస్ గెలుపులో ఒక్కటే తేడా. అదే టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి..కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదిపారు.ఎక్కడ వీలైతే అక్కడ పార్టీ తరపున సభలు పెట్టడం, క్యాడర్‌కు అండగా ఉంటానని ప్రకటించడం ద్వారా శ్రేణుల్లో ఉత్తేజం కలిగించారు.ముఖ్యంగా తనదైన మేనరిజంతో అధికార పార్టీపై మునుపెన్నడు విరుచుకుపడనంతగా రేవంత్ విమర్శలు చేశారు. దీంతో మొదట రేవంత్‌ను పట్టించుకోని బీఆర్ఎస్ సైతం.. చివరకు రేవంత్‌ను టార్గెట్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను మీడియా వేదికగా రేవంత్ ఎండగట్టారు. ఇది పూర్తి కమిషన్ల సర్కారంటూ రేవంత్ విరుచుకుపడ్డారు. రేవంత్ విమర్సలు సైతం ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. దీనికి తోడు కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలను.. ప్రచారంలో భాగం చేశారు రేవంత్. వారితోనే కాంగ్రెస్ ఇచ్చిన పార్టీకి పట్టంగట్టాలని ప్రకటన చేయించారు. ఇవన్నీ ప్రజల్లో రేవంత్ ఇమేజ్ తోపాటు పార్టీ ఇమేజ్ను పెంచాయి.
భట్టివిక్రమార్క ప్రజాసంగ్రామ యాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం.. ప్రచారం పర్వంలో కీలకపాత్ర పోషించారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర నిర్వహించారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ భట్టివిక్రమార్క ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తాము తప్పకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అంతేకాదు.. వాటిని తమ మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు.
ఎన్నికల్లో ఎన్నారైలు
యశస్వినిరెడ్డి సంచలన విజయం
అమెరికాలో మహిళల కోసం ‘వేటా’ పేరుతో జాతీయ సంఘాన్ని స్థాపించిన ఝాన్సీరెడ్డి కోడలిగా తెలంగాణ ఎన్నికల్లో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై 46,402ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన యశస్వినిరెడ్డి వివాహం అనంతరం అమెరికాకు వెళ్లి.. అక్కడ కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేశారు. వాస్తవానికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తొలుత విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల రaాన్సీరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆమె తన స్థానంలో కోడలు యశస్వినికి అవకాశమివ్వా లని కోరడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించి ఆమెకు టికెట్ ఇచ్చింది. దయాకరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి మొదటి రౌండ్ నుంచి మెజారిటీని చాటుతూ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌రావు 40 ఏళ్ల రాజకీయ చరిత్రకు పాలకుర్తి ప్రజలు స్వస్తి పలికారని అన్నారు.
ఎల్లారెడ్డిగడ్డపై విజయ కేతనం ఎగరేసిన మదన్ మోహన్
అమెరికాకు చెంది న మరో ఎన్నారై మదన్ మోహన్ రాజకీయాలపై ఆసక్తితో ఇండియాకు తిరిగి వచ్చారు. మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను నిర్వహిం చారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి 24 వేల భారీ మెజారిటీతో బిఆర్ఎస్ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎల్లారెడ్డికి బస్సు డిపో తీసుకొస్తానన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను ప్రత్యేక శ్రద్ధతో కల్పిస్తానని మదన్మోహన్ ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇచ్చారు. ఐటీరంగంపై ఆయనకున్న పట్టు కారణంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఆయన ఎఐసిసి కమ్యూనికేషన్స్ కమిటీ వైస్ చైర్మన్‌గాను, టిపీసిసి ఉపాధ్యక్షులుగానూ ఉన్నారు.
భుక్యా జాన్సన్ నాయక్
అమెరికాలో సాఫ్ట్వేర్ బిజినెస్‌లో ఉన్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన భుక్యా జాన్సన్ నాయక్ ఈ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ యస్.టి. రిజర్వుడు నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో కలిసి నిజాం కళాశాలలో చదువుకొన్న ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపారం చేసుకొంటూ కేటీఆర్‌తో స్నేహబంధం కారణంగా ఖానాపూర్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ టిక్కెట్ సాధించి బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు చేతిలో ఓటమి పాలయ్యారు.
సుధీర్ జలగం..
ఎన్నారై సుధీర్ జలగం.. కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసి సంచలనం సృష్టించారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేయడం ద్వారా అందరి దృష్టిని ఆయన ఆకర్షించారు. తొలుత బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావించినా..టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కాని ఆయన నామినేషన్ రిజక్ట్ అవడంతో ఆయన పోటీలో లేకపోయినా తనకు ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో పలువురికి సహాయం చేశారు. మాతృ భూమిపై మమకారంతో కోదాడ ఇతర చోట్ల పలుసేవా కార్యక్రమాలను జలగం సుధీర్ చేశారు.
మధు యాష్కి
అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ఎన్నారైలలో ఒకరైన మధుయాష్కి గౌడ్ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బి నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయారు.













