Hyderabad Link: సిడ్నీ మారణహోమం.. భాగ్యనగరానికి ‘ఉగ్ర’ మచ్చ?
ప్రపంచ పటంలో ఐటీ హబ్‌గా, విశ్వనగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్ కీర్తికి మరోసారి మచ్చ పడింది. ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో 11 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాశవిక కాల్పుల ఘటన మూలాలు భాగ్యనగరంలో బయటపడటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. బాండీ బీచ్ (Bonde beach) వద్ద జరిగిన నరమేధానికి ప్రధాన సూత్రధారి అయిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్లినవాడేనని, అతడి వద్ద భారత పాస్‌పోర్ట్ ఉందని ఆస్ట్రేలియా అధికారులు ధృవీకరించడంతో భారత నిఘా వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ఆస్ట్రేలియా అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఒక విదేశీయురాలిని వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. ఈ కాల్పుల్లో సాజిద్‌తో పాటు అతని కుమారుడు నవీద్ కూడా పాల్గొన్నాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగినప్పటికీ, తండ్రి ద్వారా సంక్రమించిన తీవ్రవాద భావజాలం అతడిని కూడా హంతకుడిగా మార్చింది. గడిచిన 25 ఏళ్లలో సాజిద్ కేవలం రెండుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చాడని, చివరిసారిగా 2022లో వచ్చి వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పోలీసులు సాజిద్ కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన కేవలం ఒక వ్యక్తికి సంబంధించినదిగా చూడలేం. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా, ఏదో ఒక మూల హైదరాబాద్ లింక్ బయటపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గతంలో మక్కా మసీదు పేలుళ్లు, దిల్సుఖ్నగర్ బాంబు దాడుల నుండి మొదలుకొని.. ఇటీవల ఐసిస్ (ISIS) రిక్రూట్మెంట్ల వరకు హైదరాబాద్ పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు నేరుగా ఆస్ట్రేలియాలో జరిగిన దాడిలో నిందితుడు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కలిగి ఉండటం, ఇక్కడి నుంచి వెళ్లిన వాడే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), ఎన్ఐఏ (NIA) వంటి సంస్థలు ఎప్పటికప్పుడు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేస్తున్నా, ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టలేకపోతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కలుపు మొక్కను పైపైన కత్తిరిస్తున్నారే తప్ప, వేర్లతో సహా పెకిలించలేకపోతున్నారు అనడానికి తాజా ఘటనే నిదర్శనం. సాజిద్ 2022లో హైదరాబాద్ వచ్చినప్పుడు నిఘా వర్గాల కంటపడకుండా ఎలా ఉండగలిగాడు? ఇక్కడ అతనికి సహకరించిన స్లీపర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఇప్పుడు లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. భాగ్యనగరంలో ఉగ్రవాద భావజాలం ఒక అంతర్లీన ప్రవాహంలా (Undercurrent) కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై గళం విప్పుతున్న తరుణంలో, భారత పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తి విదేశాల్లో మారణకాండ సృష్టించడం దేశ ప్రతిష్టను దిగజార్చే అంశం. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలకు నెలవైన హైదరాబాద్.. ఇలాంటి వార్తలతో ‘టెర్రర్ హబ్’గా ముద్రపడే ప్రమాదం ఉంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులపై, పర్యాటకంపై, విదేశాల్లో నివసించే సాధారణ హైదరాబాదీల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులను ఇకపై అనుమానపు చూపులతో చూసే పరిస్థితిని ఇలాంటి ఘటనలు కల్పిస్తాయి.
సిడ్నీ ఘటన ఒక హెచ్చరిక మాత్రమే. హైదరాబాద్‌ను కేవలం భౌగోళికంగా అభివృద్ధి చేస్తే సరిపోదు, సామాజికంగా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద భావజాలాన్ని నరనరాన ఎక్కించుకున్న వారిని, వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. కేవలం ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం కాకుండా, నిరంతర నిఘా, కఠినమైన చర్యలతో ఈ ఉగ్ర మచ్చను చెరిపివేయాలి. లేదంటే, “బ్రాండ్ హైదరాబాద్” భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. దీనికి ఇప్పుడే, ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి.






