బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు ఊరట..

కొన్ని నెలలుగా ఎటు తేలకుండా మిగిలిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట కలిగింది. మార్చి 16న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విషయంలో కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కవిత జైలులోనే ఉంటుంది. పలు సందర్భాలలో బెయిల్ కోసం ఆమె వేసిన పిటీషన్ను కోర్టు నిర్మొహమాటంగా కొట్టి పడేసింది. దీంతో అసలు కవితకు బెయిల్ వస్తుందా లేదా అని బీఆర్ఎస్ నేతలు అందరూ ఆందోళన చెందారు.
గత ఐదు నెలలుగా తీహారు జైల్లో గడిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అనేక మలుపులు తిరిగిన ఆమె కేసు చూస్తే ఆమెకు బెయిల్ రావడం చాలా అదృష్టమని ఎవరైనా చెబుతారు. ఇక అరెస్ట్ అయిన తొలి రోజుల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు కానీ బెయిల్ రావడం ఆలస్యం అవుతున్న కొద్ది ఆమె మానసికంగా కాస్త వీక్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కవితను కలిసి ఆమెకు మనోధైర్యాన్ని అందివ్వడానికి ఆమె భర్తతోపాటు కేటీఆర్ కూడా తీహార్ జైలుకు వెళ్లి వస్తూ ఉన్నారు. రీసెంట్ గా కవిత జైలుకు వెళ్లిన తర్వాత 11 కిలోల వరకు బరువు తగ్గినట్టు కేటీఆర్ ఒకసారి పేర్కొన్నారు. జైల్ లో కాలక్షేపం చేయడానికి పుస్తకాలతో పాటు ఆధ్యాత్మికత చింతన కోసం ఓ జపమాల కూడా కవిత తెప్పించుకున్నారు. గతంలో ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవట.. అవి కాస్త జైలుకు వెళ్లాక బాగా ఇబ్బంది పెట్టాయి అని తెలుస్తోంది. ఇక కవిత బెయిల్ విషయంపై పలు సార్లు కోర్టులో విచారణ జరిగినప్పటికీ బెయిల్ రాలేదు.
కానీ మంగళవారం సుప్రీం కోర్ట్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి.. ఆమె తరఫు న్యాయవాదుల వాదోపవాదాలు విన్ని తర్వాత కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని షరతులతో ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ కొనసాగుతుందా లేక మూడునాళ్ళ ముచ్చటగా తిరిగి మళ్ళీ తీహార్ కి వెళ్లాల్సి వస్తుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.