నవంబర్ 3న మునుగోడు బైపోల్..! మునిగేదెవరు.. తేలేదెవరు..?
మునుగోడులో మునిగేదెవరో.. తేలేదెవరో నవంబర్ 3వ తేదీన తేలనుంది. మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 7న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 6వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ అన్ని అస్త్రాలూ సంధిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లారు. ఆయన ఇప్పుడు బీజేపీ తరపున ఉపఎన్నికలో బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలూ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాయి. అధికార టీఆర్ఎస్ మాత్రం ఇంకా అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని చెప్పొచ్చు. దసరా రోజు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకం. అధికార పార్టీగా టీఆర్ఎస్ ఈ బైపోల్ ను సవాల్ గా తీసుకుంది. బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే కచ్చితంగా ఈ ఉపఎన్నికలో గెలిచి తీరాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు అభ్యర్థిగా ఖరారు చేసింది. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనే టీఆర్ఎస్ తరపున అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా సందడి చేస్తోంది. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ ట్రై చేస్తోంది. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
మునుగోడు నుంచి ఇందుకు శ్రీకారం చుట్టాలనేది కేసీఆర్ ప్లాన్. దసరా తర్వాత మునుగోడులోనే పార్టీ ఎమ్మెల్యేలంతా తిష్ట వేయనున్నారు. ప్రతి మండలానికి ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఓసారి బహిరంగసభ నిర్వహించిన కేసీఆర్.. మరో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీకి మునుగోడు సిట్టింగ్ స్థానం. దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి పెద్దగా సహకరించట్లేదు. అయినా ఈ ఉపఎన్నికలో సత్తా చాటడం ద్వారా అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరపున పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేశారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి కుటుంబానికి పాల్వాయి కుటుంబం మద్దతు తెలిపింది. ఈసారి ఎలాగైనా పట్టుదలతో పాల్వాయి స్రవంతి ఉన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఒక నాయకుణ్ణి ఇన్ ఛార్జ్ గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాక ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ముందుంది. ప్రతి గడపా తొక్కుతున్న పాల్వాయి స్రవంతి.. ప్రతి ఒక్కరికీ బొట్టు పెట్టి మరీ ఓట్లడుగుతున్నారు.
ఇక పార్టీ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యూఐ.. పాదాభివందనంతో నియోజకవర్గ ఓటర్లందరికీ కాళ్లు మొక్కుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర .. మునుగోడు బైపోల్ కంటే ముందే తెలంగాణలో సాగనుంది. ఈ యాత్ర ద్వారా కచ్చితంగా మునుగోడు సీన్ మారుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. ఇక బీజేపీ ఏరికోరి ఈ ఉపఎన్నికను తెచ్చిపెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగా.. ఎంపీగా ఉన్న అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఇది కోమటిరెడ్డి కుటుంబానికి మైనస్ కానుంది. అయితే బీజేపీ మాత్రం ఈ బైపోల్ ను సీరియస్ గా తీసుకుంది. అమిత్ షా నేరుగా ఈ బైపోల్ పై నిత్యం ఆరా తీస్తున్నారు. దసరా తర్వాత బీజేపీ ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. 7వ తేదీన అన్ని గ్రామాల్లో బైక్ యాత్రలు చేపట్టనుంది. బైపోల్ ప్రచారంలో భాగంగా అమిత్ షా, నడ్డాలతో సభలు ఏర్పాటు చేయాలని ప్లాన్ వేస్తోంది. మరోవైపు బీజేపీ వ్యూహకర్త సునీల్ బన్సల్ మునుగోడులో వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఈటల రాజేందర్, వివేక్ .. తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికలకు తిరుగుండదని బీజేపీ నమ్ముతోంది.













