మునుగోడును దిగ్బంధించనున్న టీఆర్ఎస్ .. 80 మంది ఎమ్మెల్యేలు మోహరింపు!
మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. బీజేపీ ఏరికోరి తెచ్చిన ఈ ఉపఎన్నికలో ఆ పార్టీకి బుద్ధి చెప్పడం ద్వారా మరోసారి ఇలాంటి పని చేయనివ్వకుండా బుద్ధి చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించింది. ఆ ఉత్సాహంతోనే బీజేపీ మరో బైపోల్ కు తెరదీసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో కూడా టీఆర్ఎస్ ను ఓడించాలని బీజేపీ గట్టిగా శ్రమిస్తోంది. అయితే ఈసారి బీజేపీకి అలాంటి ఛాన్సే ఇవ్వకూడదనుకుంటున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందుకోసం భారీ వ్యూహాలే రూపొందిస్తున్నారు.
మునుగోడులో పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. అక్కడి పరిస్థితులను ఆంచనా వేస్తున్నారు. బీజేపీ తరపున మాత్రమే ఇప్పటికి అభ్యర్థి ఖరారయ్యారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని తేల్చలేదు. దీంతో టీఆర్ఎస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్ తమ అభ్యర్థి ఎవరో చెప్పే అవకాశం కనిపిస్తోంది. పైగా టీఆర్ఎస్ లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంది. టీఆర్ఎస్ లో అంతర్గత పోరుకు కూడా ఇది కారణమవుతోంది. ఇవన్నీ గమనించిన కేసీఆర్ ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే విపరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందనుకుంటున్నారు. అందుకే అందరూ వెళ్లి క్షేత్ర స్థాయిలో పని చేయాలని.. సరైన సమయంలో క్యాండిడేట్ ప్రకటన ఉంటుందని శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ప్రభుత్వ పరంగా ఏఏ కార్యక్రమాలు అమలు చేయాలనేదానిపైనా కేసీఆర్ దృష్టి పట్టారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోపు మునుగోడు ప్రజలకు పలు వరాలు కురిపించేందుకు అధికార యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. ఆసరా పెన్షన్లు, దళితబంధు, రైతు బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు.. లాంటి అనేక స్కీమ్ లను లబ్దిదారులను త్వరతిగతిన చేర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. దీంతో అధికార యంత్రాంగం మొత్తం ఇప్పటికే రంగంలోకి దిగింది. లబ్దిదారులందరికీ 15వ తేదీ లోపే ఇవన్నీ చేరిపోవాలని ఆదేశించినట్టు సమాచారం.
ఈ నెల 15 నుంచి కేసీఆర్ పొలిటికల్ టీమ్ రంగంలోకి దిగబోతోంది. మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ, చౌటుప్పల్ మండలాలున్నాయి. మొత్తం 159 గ్రామాలున్నాయి. వీటిలో 15 మేజర్ గ్రామ పంచాయితీలు. మొత్తం నియోజకవర్గాన్ని 80 యూనిట్లుగా విభజించారు. అంటే ప్రతి రెండు గ్రామాలు కలిపి ఒక యూనిట్ గా వికేంద్రీకరించారు. ఒక్కో యూనిట్ కు ఒక ఎమ్మెల్యే చొప్పున.. అంటే ప్రతి రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తారు. అంటే 80 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నిక పూర్తయ్యే వరకూ అక్కడే తిష్ట వేయనున్నారు. వీరికి మంత్రులు, ఎంపీలు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.
మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరగుతుందో ఇప్పుడే చెప్పలేం. రాజీనామా ఆమోదించిన తర్వాత ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరగాలి. అంటే ఇంకా సుమారు ఐదు నెలల సమయం ఉంది. కానీ ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే మునుగోడులో తిష్ట వేశాయి. గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హుజూరాబాద్ లో అన్ని అస్త్రాలు సంధించినా ఓటమి పాలవడంతో ఈసారి అలాంటి పొరపాట్లు చేయకూడదనుకుంటున్నారు కేసీఆర్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కేడర్ మొత్తాన్ని మునుగోడులో దింపేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.













