తెలంగాణ గవర్నమెంట్‌పై గవర్నర్ తమిళిసై కీలక ఆరోపణలు.. కేసీఆర్‌పై డైరెక్ట్ ఎటాక్!
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళనైనందుకే తనను అవమానిస్తున్నారా అని ప్రశ్నించారు. తనను కేసీఆర్ సర్కార్ ఏమాత్రం ఖాతరు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. తాను ఎక్కడికెళ్లినా ప్రోటోకాల్ పాటించట్లేదన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్న ఆమె.. రాజ్ భవన్ ను గౌరవించాలి కదా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన శక్తి మేర తాను పని చేస్తూనే ఉంటానన్నారు తమిళి సై. భయపడే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. మహిళా గవర్నర్ గా తనను తక్కువ అంచనా వేశారని .. అయినా తాను ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు.
రాజ్ భవన్ ను ప్రజలకు దూరం చేయాలనుకున్నారని.. అయితే తాను మాత్రం దీన్ని ప్రజాభవన్ గా మార్చానని తమిళి సై చెప్పుకొచ్చారు. మేడారం జాతరకు వెళ్లేందుక హెలికాప్టర్ అడిగితే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు గవర్నర్. తాను 8 గంటలు రోడ్డు మార్గంలో ప్రయాణించి మేడారం వెళ్లినట్లు గుర్తు చేశారు. ఇదంతా ఎవరికోసం.. ఎందుకోసం చేస్తున్నారని తమిళిసై ప్రశ్నించారు. ఒకవేళ తన ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే కనీసం సమాచారం ఇవ్వాలి కదా అని ఆమె అడిగారు. నాతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు.
వివక్షను తాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనన్నారు గవర్నర్ తమిళి సై. తాను బాధ్యతలు చేపట్టిన కొత్తలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వచ్చారని.. ఆ సందర్భంగా పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లానని ఆమె చెప్పారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా ఆయన సీఎంకు చెప్పినట్లు వెల్లడించారు. తాజాగా ఓ ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం దేనికి సంకేతమని తమిళిసై నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం సౌత్ జోనల్ సమావేశం ఏర్పాటు చేస్తే.. దానికి సీఎం కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. తాను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో హాజరయ్యానని క్లారిటీ ఇచ్చారు. అందులో పోలవరం లాంటి కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు. కానీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన పని తాను చూసుకుంటూనే పోతానన్నారు తమిళి సై. మంచి చేయాలనేది తన స్వభావమన్న ఆమె.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజ్ భవన్ తలుపులు తెరిచినట్లు చెప్పారు. ట్రైబల్ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించామన్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల పట్ల బాధ్యతగా వ్యవహరించినట్లు చెప్పారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల సమస్యలపై సీఎంకు లేఖ రాశానని.. వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి వివరాలు అందించానని గవర్నర్ చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. అవన్నీ తాను బయటకు చెప్పదలుచుకోలేదన్నారు.
మొత్తంగా గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా రాజకీయ నాయకురాలిగా మారిపోయారని.. బీజేపీ నేత లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. మరి తమిళిసై వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.













