మునుగోడులో గెలుపెవరిది? గెలుపును డిసైడ్ చేయనున్న సింబల్స్!
తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఫీవర్ నడుస్తోంది. కొని తెచ్చుకున్న ఈ ఉపఎన్నికను ఫేస్ చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. మూడు పార్టీలు బలంగా కనిపిస్తుండడంతో ఏ పార్టీ గెలుస్తుందనేది ఇక్కడ ఆసక్తి కలిగిస్తోంది.
2019లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడాయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరారు. మనుగోడుపై అధికార టీఆర్ఎస్ కక్షగట్టి అభివృద్ధి చేయకపోవడంతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోగలిగే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని.. అందుకే తాను బీజేపీ తరపున బరిలోకి దిగబోతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టుంది. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ గూటికి చేరగా.. సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. ఇదిప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేలు చేస్తుందో, కీడు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ వాది. నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది. కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అన్నట్టు వీరిపై ముద్ర ఉంది. ఇప్పుడేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం సింబల్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. జనాల్లో హస్తం గుర్తుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కోమటిరెడ్డి కుటుంబానికి.. ఇప్పుడు ఈ సింబల్ పెద్ద తలనొప్పిగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూరల్ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో మునుగోడులో సింబల్ గెలుపును నిర్దేశిస్తుందని భావిస్తున్నారు. చాలా మంది ఇప్పటికీ కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్సేనని భావించి హస్తం గుర్తుకు ఓటేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్లస్ పాయింట్. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయినా మునుగోడు బైపోల్ ప్రచారంలో మాత్రం తాను భాగం కాబోనని ఇప్పటికే ప్రకటించారు. రేవంత్ రెడ్డితో వెంకట్ రెడ్డికి వైరుధ్యం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ కొంత కేడర్ వెంకట్ రెడ్డి వైపు ఉంటే.. మరికొంత కేడర్ రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్లింది. ఈ చీలిక తమకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పైగా కేసీఆర్ పై కోపం ఉంటే రాజీనామా చేసి కాంగ్రెస్ తరపునే మళ్లీ పోటీ చేసి గెలిచి తానేంటో నిరూపించుకోవాల్సిన రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరడాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది కాంగ్రెస్. కేవలం స్వలాభం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని.. ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగుతారనేది తేలలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారు. కోమటిరెడ్డి కంచుకోటలో తానేంటో నిరూపించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతుండడం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్స్.
ఇక టీఆర్ఎస్ మాత్రం పక్కా ధీమాతో ఉంది. మునుగోడులో కచ్చితంగా తాము గెలవబోతున్నామని సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పేశారు. ప్రతి గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలను పంపించి కోఆర్డినేట్ చేయిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లో కూడా అంతర్గత పోరు నడుస్తోంది. టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కేసీఆర్ మనసులో ఏముందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పటికే ఒకసారి కేసీఆర్ మునుగోడు పర్యటించి బహిరంగసభ కూడా నిర్వహించారు. కానీ అభ్యర్థిని తేల్చలేదు. అయితే అభ్యర్థి ఎవరైనా అందరూ సహకరిస్తారనే నమ్మకం టీఆర్ఎస్ నేతలకుంది. దీనికి తోడు అధికారంలో ఉండడం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం.. లాంటి అంశాలు టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్స్. అయితే బీజేపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదల కేసీఆర్ లో కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటుందని.. బీజేపీకి మూడో స్థానమే మిగులుతుందని కేసీఆర్ చెప్తున్నారు. పార్టీ సింబల్ బీజేపీకి పెద్ద మైనస్ కాబోతోందని కేసీఆర్ అంచనా. కోమటిరెడ్డి అంటే ఇప్పటికీ కాంగ్రెస్సేనని భావించేవాళ్లు చాలా మంది ఉన్నారని.. అందుకే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని టీఆర్ఎస్ శ్రేణులు నమ్ముతున్నాయి. ఏదేమైనా గెలుపు మాత్రం తమదేననేది టీఆర్ఎస్ ధీమా.













