ఏపీలో కేసీఆర్ టార్గెట్ ఎవరు..? ఎవరితో కలిసి పనిచేయబోతున్నారు..?
భారత్ రాష్ట్ర సమితి పేరిట జాతీయ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమైన కేసీఆర్ ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ను వేదికగా చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించేవారు. పలువురు నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అవే పరిచయాలతో ఏపీలోనూ బీఆర్ఎస్ ను విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. తమతో కలసి వచ్చే నేతలు, పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ కు ఇప్పటికిప్పుడు ఉత్తర భారతదేశంలో ఆదరణ లేకపోవచ్చు. ఈ విషయం కేసీఆర్ కు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టబోతున్నారు కేసీఆర్. ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల్లో చిన్న పార్టీలు, కీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో పలువురు నేతలు కేసీఆర్ కు సుపరిచితులు. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గ నేతలు కేసీఆర్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొప్పుల వెలమ సామాజికవర్గ నేతలు ఎక్కువగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిని తమవైపు లాక్కునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ గా ఉండి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను కూడా కేసీఆర్ సంప్రదించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ టచ్ లో ఉన్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలలోని అసంతృప్త నేతలను కూడా కేసీఆర్ తనవైపు లాక్కొనేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీల తరపున సీట్లు ఆశించి భంగపడే నేతలకు బీఆర్ఎస్ తరపున సీట్లు ఇచ్చేలా కేసీఆర్ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
కేసీఆర్ మదిలో ఇంకో ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ఆ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. అయితే ఆయన బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ ను తనవైపు తిప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టయితే టీడీపీతో కూడా కలిసి పని చేసేందుకు కేసీఆర్ కు అభ్యంతరం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. మరి చూద్దాం కేసీఆర్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో..?













