సస్పెన్స్ కు తెర..! త్వరలోనే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటన ..!!
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించబోతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్టు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో ఈ విషయం వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా.. వద్దా అని అడిగినప్పుడు ప్రజలంతా ముక్తకంఠం వెళ్లాలని ఆశీర్వదించారు. ఇదే ఉత్సాహంతో కేసీఆర్ కూడా నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని.. ఇందుకు మీ దీవెనలు కావాలని అభ్యర్థించారు. అయితే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వెళ్తారు.. ఎలా వెళ్తారు.. లాంటి అనేక ప్రశ్నలు తలెత్తాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లేందుకు ఒక జాతీయ పార్టీని పెట్టబోతున్నట్టు రెండు, మూడు నెలల కిందటే వార్తలు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి – బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు రూమర్స్ బలంగా వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్స్ కు చెక్ పెట్టి ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. త్వరలోనే కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. బహుశా దసరా తర్వాత కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అది బీఆర్ఎస్సా.. లేకుంటే మరో పేరు పెడ్తారా అనేది తెలియాల్సి ఉంది. కానీ కొత్త పార్టీ పెట్టడం మాత్రం ఖాయమైంది.
హైదరాబాద్ లో టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులంతా సమావేశమై కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానించారు. అంతకుముందు ప్రగతి భవన్లో కేసీఆర్ తో సమావేశమైన జిల్లా అధ్యక్షులు.. తమ అభీష్టాన్ని పార్టీ అధినేతతో పంచుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లాల అధ్యక్షులు బీజేపీని గద్దె దించేందుకు కేసీఆర్ యాక్టివ్ రోల్ పోషించాల్సిన అవసరం ఉందని.. ఇందుకు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్లడమే మార్గమని వెల్లడించారు. ఇదే విషయాన్ని తాము పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేసీఆర్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీని గద్దె దించాల్సిందేనని కొంతకాలంగా కేసీఆర్ బలంగా పిలుపునిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలో దేశం దివాళా తీస్తోందని.. మిగిలిన దేశాలతో పోల్చితే అపరిమిత వనరులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని దుయ్యబడుతున్నారు. దేశ సంపదను ఒకరిద్దరికి దోచి పెడుతున్నారని.. దీంతో సామాన్యులపై విపరీత భారం పడుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని గద్దె దించితేనే దేశానికి పట్టిన పీడ విరగడవుతుందని చెప్తున్నారు. ఇందుకోసం ఆయన తీవ్రంగానే శ్రమిస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వమే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం ఆయన బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే నితీశ్ కుమార్, మమత బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి, ఉద్దవ్ ఠాక్రే.. తదితరులతో సమావేశమయ్యారు. ఇటీవల రైతు సంఘాల నేతలను హైదరాబాద్ పిలిపించి వారితో సుదీర్ఘంగా చర్చించారు. పలువురు విద్యావేత్తలు, మేధావులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నానని కేసీఆర్ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇవన్నీ జాతీయ పార్టీ సన్నాహకాల్లో భాగమేనని ఇప్పుడు అర్థమవుతోంది. త్వరలోనే కేసీఆర్ ఈ సస్పెన్స్ కు తెర దించబోతున్నారు.













