కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ఇదే..! ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కూడా రెడీ..?
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని డిసైడ్ చేసుకున్న కేసీఆర్.. అందుకోసం చకచకా అడుగులు వేస్తున్నారు. దసరా రోజు అంటే ఈ నెల 5న కేసీఆర్ పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే ఏ పేరు పెడతారు.. ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశాలపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. పార్టీ పేరు, ఆఫీసు, పార్టీ సారథులు.. లాంటి అనేక అంశాలపై కేసీఆర్ పక్కా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అన్ని అంశాలనూ కేసీఆర్ దసరా రోజు ప్రకటించబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి – టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర సాధనను సాకారం చేయగలిగారు. తెలంగాణలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ నిలిచింది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఇదే ఉత్సాహన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకురావాలనుకుంటున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ తరహాలోనే జాతీయ పార్టీ కూడా ఉండాలని భావిస్తున్నారు. అందుకే జాతీయ పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్.. దేశంలో బీఆర్ఎస్.. ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ. ఇందుకు తగ్గట్టుగానే ఆయన స్పీచ్ లలో ఎప్పుడూ జై తెలంగాణ అని మాత్రమే గతంలో వినిపించేది. ఇవాళ వరంగల్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ గతానికి భిన్నంగా జై తెలంగాణతో పాటు జై భారత్ అని నినదించారు. దీంతో ఆయన పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితిగా ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.
ఇక జాతీయ పార్టీని ఢిల్లీ నుంచే నడిపించాలనుకుంటున్నారు కేసీఆర్. హైదరాబాద్ నుంచి నేషనల్ పార్టీని నడపడం అంత సబబుగా ఉండదని భావిస్తున్న ఆయన.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో కార్యాలయ భవనం ఇప్పటికే సిద్ధమైందని సమాచారం. దసరా రోజు హైదరాబాద్ లో పార్టీని ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి.. అక్కడి పార్టీ తాత్కాలిక కార్యాలయంలో పలువురు కీలక నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ ఇప్పటికే ఓ కార్యాలయాన్ని నిర్మిస్తోంది. అయితే దాని నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా ఏడాది సమయం పడుతుందని అంచనా. అందుకే జాతీయ పార్టీ కోసం తాత్కాలికంగా ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక.. జాతీయ పార్టీని వివిధ రాష్ట్రాల్లో నడిపించేందుకు వీలుగా పలువురు సమన్వయ కర్తలను నియమించేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ను దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. అలాగే వినోద్, కేశవరావు తదితర నేతలకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా స్కెచ్ వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఓ మోస్తరు ప్రభావం చూపే చిన్న చిన్న పార్టీలు, నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













