హైదరాబాద్ కు సర్వీస్ నౌ
ఐటీ పరిశ్రమల కోసం రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో 300 ఎకరాల్లో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రితో అమెరికాకు చెందిన ఐటీ కంపెనీ సర్వీస్ నౌ ప్రెసిడెంట్, సీఈవో జాన్ డొనాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సర్వీస్ నౌ ఇప్పటికే సిద్దంగా ఉందని, త్వరలో మరో మూడు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాయన్నారు. ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలిస్తుందన్నారు. నగరంలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సర్వీస్ నౌ సీఈవో జాన్ డొనాహు అన్నారు. ప్రారంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది మరో వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. కొత్త తరానికి స్టార్టప్‌ల ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రపంచంలోని టాప్-100 కంపెనీల్లో రానున్న రెండు దశాబ్దాలపాటు ఉపాధి కల్పనలో వృద్ధి ఉండదన్నారు. టీహబ్ రెండేళ్లలోనే దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా అవతరించిందని, ఏడాదిలో పూర్తయ్యే టీ హబ్ ఫేజ్-2 ప్రపంచంలోనే పెద్ద ఇంక్యుబేటర్ కానుందన్నారు.













