ఈటల రాజేందర్‌కు పొమ్మన లేక పొగ పెడుతున్నారా…?
తెలంగాణ బీజేపీలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించబోతున్నామని, కేసీఆర్ కు జైలు కూడు ఖాయమని బీజేపీ నేతలు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారు. దీంతో పార్టీని ఎలా సెట్ చేయాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ బండి, ఈటల వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బండిని తప్పించి ఈటలకు కీలక పదవి ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు బీజేపీలో చిచ్చుకు కారణమయ్యాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అప్పటివరకూ ఓ రేంజ్ లో కొనసాగిన వలసలు ఆగిపోయాయి. పైగా వెళ్లిన నేతలు కూడా మళ్ళీ సేఫ్ జోన్ కోసం చూసుకోవడం మొదలైంది. దీంతో వలస నేతలపై ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలు అనుమానించడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో తమను మొదటి నుంచి చిన్న చూపు చూస్తున్నారని, బండి సంజయ్ తమను కలుపుకు పోవడం లేదని వలస నేతలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఒకవైపు నేతలు చేరకపోవడం, మరోవైపు చేరిన నేతలు మళ్లీ పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితులు ఏర్పడడంతో అధిష్టానం నష్ట నివారణ చర్యలకు దిగింది.
దొంగ చేతికే తాళాలు ఇచ్చిన చందంగా.. వలస నేతలకే పూర్తిగా పార్టీ బాధ్యతలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఈటల రాజేందర్ కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చి డీకే అరుణకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనుకుంది. అయితే ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని బండి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈటలకు వ్యతిరేకంగా బండి వర్గమంతా ఏకమై రహస్య సమావేశాలు నిర్వహించింది. ఈటలకు ప్రచార కమిటీ పదవి అనేది అవాస్తవమని, దీని వెనుక కేసీఆర్ ఉన్నారని బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈటల వెనుక కేసీఆర్ ఉన్నారని పరోక్షంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
అసలే బీజేపీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న ఈటల రాజేందర్ కు తాజా పరిణామాలు అస్సలు రుచించడం లేదు. మొదటి నుంచి ఈటల రాజేందర్ ను అనుమానాస్పదంగానే చూస్తున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఏకంగా ఆయన కేసీఆర్ కోవర్ట్ అన్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. మరోవైపు పొంగులేటి, జూపల్లితో పాటు ఈటల కూడా కాంగ్రెస్ లోకి వెళ్లిపోతారనే ప్రచారం కూడా మరోవైపు మొదలు పెట్టారు. ఇలా ఈటల రాజేందర్ పై ముప్పేట దాడి మొదలైంది. అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే ఈటల రాజేందర్ వీటని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారేమో అని సందేహిస్తున్నారు. మరి ఈ పరిణామాలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.













