రుణమాఫీ అస్త్రం..
తెలంగాణ సీఎం కేసీఆర్ మాంచి దూకుడు మీదున్నారు. ఎన్నికల వేళ అన్నివర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న అన్నింటినీ క్లియర్ చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా నేటి నుంచి రుణమాఫీ ప్రక్రియను అమలు చేయనున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే మళ్లీ 2023 ఎన్నికల ఏడాది కావడంతో ఆ ఫైల్ దుమ్ము దులిపారు. రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను నెలన్నర లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా 19వేల కోట్లను రైతుల ఖాతాల్లో రైతుబంధు తరహాలో విడతలవారీగా జమ చేయనున్నారు.
రైతు రుణమాఫీ ప్రక్రియను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా అధ్యక్షులు.. ప్రజలతో కలిసి ఎవరికి వీలైన విధంగా వారు సంబరాలు చేసుకోవాలన్నారు. ఇందులో రైతుబంధు సమితి సభ్యులు, సహకార సంఘ ప్రతినిధులు పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.
ఈ విడతలో 29.11 లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా లబ్ది చేకూరనుంది. అంటే ఒక్కో కుటుంబానికి యావరేజ్ గా ముగ్గురు సభ్యులను వేసుకున్నా.. దాదాపు కోటిమందికి లాభం కలుగుతుంది. ఫలితంగా నాలుగుకోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో కోటి ఓట్లు తమకు పడతాయన్నది బీఆర్ఎస్ నేతల అంచనాగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ వర్గాల వారీగా వరాల జల్లు కురిపించడంతో.. అవన్నీ ఎన్నికల వేళ తమకు ఓట్ల రూపంలో కురుస్తాయని.. ఫలితంగా తమ గెలుపు నల్లేరుపై నడకేనని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
కరెక్టుగా సమయం చూసి కేసీఆర్… రైతు రుణమాఫీ అస్త్రాన్ని సంధించారని చెప్పొచ్చు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతు రుణమాఫీ ప్రక్రియ .. నెలన్నర రోజుల పాటు అమలవుతుంది. ఇప్పటికే చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మరోసారి రైతులను బీఆర్ఎస్ నేతలు కలిసే విదంగా పార్టీపరంగా చర్యలు చేపట్టేందుకు వీలుకానుంది. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలుచేస్తున్న కేసీఆర్ సర్కార్.. ఇప్పుడు రెండో విడత రుణమాఫీతో విపక్షాలపైకి మరో సూపర్ అస్త్రాన్ని వదిలినట్లైంది.













