KCR : కేసీఆర్తో రేవంత్ షేక్ హ్యాండ్.. ఆ వెంటనే గులాబీ బాస్ నిష్క్రమణ
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఈరోజు ఒక ఆసక్తికరమైన, అదే సమయంలో చర్చనీయాంశమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న పరిణామాలు.. అటు ప్రజాస్వామ్య సంస్కృతిని, ఇటు రాజకీయ వ్యూహాలను ఏకకాలంలో తెరపైకి తెచ్చాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ మధ్య జరిగిన కరచాలనం ఒక ‘పిక్చర్ ఆఫ్ ది డే’గా మిగిలితే, ఆ వెంటనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది.
గత కొన్నాళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న రాజకీయ వైరానికి అసెంబ్లీ వేదికగా ఒక చిన్న విరామం లభించినట్లయింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష నేత హోదాలో కేసీఆర్ తన సీటులో ఆసీనులవ్వడం, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేయడం ప్రజాస్వామ్య పరిణితికి అద్దం పట్టింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ వాకబు చేయడం, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క తదితరులు ఆయనను పలకరించడం.. రాజకీయాలకు అతీతంగా సభలో ఉండాల్సిన సౌహార్ద్ర వాతావరణాన్ని చాటిచెప్పింది. వ్యక్తిగత ద్వేషాలు సభ సంప్రదాయాలకు అడ్డుకాకూడదని ఈ సంఘటన నిరూపించింది.
అయితే, ఈ వాతావరణం ఎంతోసేపు నిలవలేదు. సభలో మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన వెంటనే, కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తొలిరోజు కావడంతో అజెండా కేవలం సంతాప తీర్మానాలు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశానికే పరిమితం కాబట్టి, పెద్దగా చర్చలేమీ ఉండవని భావించి కేసీఆర్ వెళ్లిపోయారని బీఆర్ఎస్ వర్గాలు సమర్ధించుకుంటున్నాయి. కానీ, ఒక ప్రతిపక్ష నేతగా సభలో కనీస సమయం గడపకపోవడం, సంతాప తీర్మానాల చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ ప్రధానంగా విశ్లేషించాల్సిన అంశం.. కేసీఆర్ వైఖరి. ఇటీవలే ప్రెస్ మీట్లో కృష్ణా జలాల అంశంపై, ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. ఆ స్థాయిలో బయట మాట్లాడినప్పుడు, దానికి చట్టసభ వేదికగా సమాధానం ఆశించడం సహజం. ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అసెంబ్లీని మించిన వేదిక మరొకటి లేదు. కానీ, ప్రెస్ మీట్లో గంటల తరబడి మాట్లాడిన కేసీఆర్, అసెంబ్లీలో మాత్రం రెండు నిమిషాలు కూడా ఉండకపోవడం.. ఆయన కేవలం “అటెండెన్స్” కోసమే వచ్చారా అనే అనుమానాలను బలపరుస్తోంది.
ప్రస్తుతం అందరి దృష్టి జనవరి 2 నుంచి జరగబోయే పూర్తిస్థాయి సమావేశాలపైనే ఉంది. ప్రభుత్వం ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక అంశాలపై శ్వేతపత్రాలు లేదా చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్ సభకు రాకపోతే, బయట ప్రెస్ మీట్లలో ఆయన చేసే ఆరోపణలకు రాజకీయ విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉంది. “ప్రశ్నించే దమ్ములేక పారిపోయారు” అనే అధికార పక్షం విమర్శకు బలం చేకూరుతుంది. ఆయన సభకు వచ్చి, చర్చలో పాల్గొంటేనే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది.
మొత్తంగా, తొలిరోజు సమావేశం కరచాలనంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసినా, కేసీఆర్ నిష్క్రమణతో సస్పెన్స్ మిగిల్చింది. ప్రభుత్వంపై బయట చేసే ఆరోపణలను సభలో నిరూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంది. కేవలం హాజరు పట్టికలో సంతకం కోసమే కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీని వేదికగా చేసుకుంటారా లేదా అనేది రాబోయే సెషన్లలో తేలనుంది.






