కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ ఫైట్…
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్… గత ప్రభుత్వ అవినీతిపై ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం మొదలు కొని విద్యుత్ శాఖలో అవినీతి వరకూ అన్నింటిపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తోంది. గత ప్రభుత్వం అవినీతితో రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చిందని, ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం సైతం కేంద్రాన్ని దేబిరించాల్సిన దుస్థితి దాపురించిందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. సీఎం కుటుంబం సహా పలువురు మంత్రులు సైతం లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ ఎస్ పదేళ్ల పాలనకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. గత పదేళ్లలో రాష్ట్రం ఏవిధంగా అప్పులు పాలైంది? ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశారు? ఏయే పథకాలు ఎలా ఉన్నాయి. ఏయే ప్రాజెక్టులు ఎక్కడ నిలిచి పోయాయి? వంటి అనేక కీలక విషయాలను అందులో వివరించారు. ప్రధానంగా కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ.. ఇచ్చిన వైట్ పేపర్ రాజకీయ దుమారమే రేపింది. ప్రస్తుతం రోజు వారీ ఖర్చులకు కూడా.. కేంద్రం ముందు నిలబడే పరిస్థితి వచ్చిందని పేర్కొనడం.. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల్లోనూ అవినీతి పెరిగిపోయిందని.. కోట్లకు కోట్లు దోచుకున్నారని చెప్పడం ద్వారా.. కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే టార్గెట్ చేసింది.
దీనికి నాటి మంత్రి హరీశ్ రావు.. గట్టిగానే కౌంటరిచ్చారు. తాము అప్పు చేసింది గోరంత అయితే రాష్ట్రానికి కొండంత ఆస్తులు సంపాదించామన్నారు. అయితే హరీశ్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని.. సీఎం రేవంత్ నేరుగానే విమర్శించారు. అంతేకాదు.. వారి అవినీతిపై ప్రశ్నిస్తే.. బీఆర్ఎస్ సభ్యులు పోడియం దగ్గరకు దూసుకొస్తున్నారని మండిపడ్డారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. ఇప్పుడు విద్యుత్ శాఖలోనూ భారీగా అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. పదివేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారన్నారు. అయితే దీన్ని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అయితే దీనిపై విచారణకు ఆదేశించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి జరగడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభ పరిస్థితి చూస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిపత్య పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది.













