నేడే ‘రేవంత్’ రెడ్డి పట్టాభిషేకం..
తెలంగాణ కాంగ్రెస్ తొలిముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు.పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ చట్టానికి సంబంధించిన ముసాయిదాపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయనున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కాంగ్రెస్ కు అధికారాన్ని దగ్గర చేసిన ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ముఖ్యనేతలకు కేబినెట్ లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నల్గొండ జిల్లా నుంచి సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా పాలనా అనుభవం కలిగిన వారికి పెద్దపీట వేస్తున్నట్లు కేబినెట్ నిరూపిస్తోంది.
రేవంతుడి పట్టాభిషేకానికి కాంగ్రెస్ అగ్రనేతలు విచ్చేశారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక.. పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈకార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, విపక్షనేత చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆహ్వానం ఉంది. అయితే ఈకార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా.. లేదా ఎవరినైనా పంపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
రేవంత్ ప్రమాణస్వీకారానికి దాదాపు లక్షమంది అభిమానులు, కార్యకర్తలు విచ్చేసే అవకాశముండడంతో.. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ముందస్తుచర్యలు చేపట్టారు. నగరంలో 12 చోట్ల పార్కింగ్ కు అవకాశం కల్పించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. వాహనాలను దారి మళ్లించనున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సైతం పోలీసులు వెల్లడించారు. అతిరథమహారథులు విచ్చేస్తుండడంతో.. పటిష్ట పహారా ఏర్పాటు చేశారు.













