ఆ 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు : రేవంత్
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా నల్గొండ జిల్లాలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభినందించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండ. రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది నల్గొండ వీరులు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవి వదులుకున్నారు. కొందరు కాంగ్రెస్ నుంచి గెలిచి దొరల గడీల వద్ద కాపలా కాస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిని మళ్లీ అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు. కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి అని అన్నారు.
ఇసుక మీద ఎవరైనా పిల్లర్లు, ప్రాజెక్టులు నిర్మిస్తారా? రూ.లక్షన్నర కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కుంగుతుందా? నల్గొండకు నీరు ఇచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. నల్గొండకు నీరు ఇచ్చే 10 కిలోమీటర్ల టన్నెల్ పదేళ్లుగా ఎందుకు పూర్తి కాలేదు? తమ ఫామ్‌హౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకున్న కేసీఆర్ నల్గొండకు నీరు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.













