Revanth Reddy – Chandrababu : చంద్రబాబుపై పోరాటానికి సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి..!?

చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ తెలుగు రాష్ట్రాలకు (Telugu States) ముఖ్యమంత్రులు. వీళ్లు మధ్య మంచి బంధమున్నా రాష్ట్రాల మధ్య వైరం వాళ్లను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఇద్దరూ ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వాళ్లు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై (AP CM Chandrababu) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) పోరాటానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురుశిష్యులు కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలుంటాయని భావించిన వాళ్లందరికీ ఈ పరిణామం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (AP) ను సస్యశ్యామలం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. ఇందుకోసం గోదావరిలో (Godavari) వృథాగా పోతున్న వరద జలాలను ఎత్తిపోయడం ద్వారా రాయలసీమకు (Rayalaseema) తరలించాలనుకుంటున్నారు. పోలవరం (Polavaram) నుంచి కర్నూలు జిల్లా బనకచర్లకు (Banakacharla) నీటిని తరలిస్తే రాయలసీమ అంతటికీ నీటిని అందించవచ్చని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వానాకాలంలో వరద నీటిని మాత్రమే వాడుకునేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు కావడంతో ఇతర రాష్ట్రాలకు అభ్యంతరం ఉండకపోవచ్చని చంద్రబాబు భావించారు. ఇదే విషయాన్ని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి నీటి కొరత ఉండదని అందరూ అనుకున్నారు.
అయితే పోలవరం – బనకచర్ల అనుసంధానాన్ని వ్యతిరేకించాలని తెలంగాణ నిర్ణయించింది. నీటిపారుదల రంగంపై (Irrigation Department) సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను ఏపీ ముఖ్య కార్యదర్శికి తెలియజేయాలన్నారు. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో (Godavari River Management Board) పాటు కేంద్ర జలశక్తి శాఖకు (Jal Shakthi Department) కూడా లేఖాలు రాయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాక పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు, భద్రాచలం ఆలయానికి (Bhadrachalam Temple) కలిగే ముప్పుపై హైదరాబాద్ ఐఐటీతో సమగ్ర అధ్యయనం చేయించాలని సూచించారు. నెల రోజుల్లోపు నివేదిక తయారు చేయాలన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పలు అంశాలపై వివాదాలున్నాయి. విభజన చట్టంలోని (bifurcation Act) పలు అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇప్పుడు పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కూడా అందులో చేరింది. నికర జలాలపై ఆధారపడి కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దీనికి అనుమతులు అవసరం లేదనేది ఆంధ్రప్రదేశ్ ఆలోచన. అయినా తెలంగాణ మాత్రం అనుమతుల్లేని ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలని.. అభ్యంతరం వ్యక్తం చేయాలని నిర్ణయించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం తలెత్తినట్లు అయింది. చంద్రబాబు విషయంలో రేవంత్ రెడ్డి సాఫ్ట్ కార్నర్ చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.