తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేణుకా చౌదరి..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. అయితే కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నాయి కాంగ్రెస్, బీజేపీలు. అయితే ఈ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. ఈసారి ఫైట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు సరికొత్త అస్త్రంతో ముందుకు రాబోతోంది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్పుకుంటోంది. అయినా ఆ పార్టీని మాత్రం తెలంగాణ ప్రజలు ఆదరించలేదు. వరుసగా రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ పై ప్రజలు విసిగిపోయారని.. కచ్చితంగా హస్తం పార్టీని గెలిపిస్తారని నమ్మకంగా ఉన్నారు. అందుకే కర్నాటక తరహా మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని నేతలు సంతోషంగా ఉన్నారు.
అయితే తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు కేసీఆర్. అయితే ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఇలా ఆయన ఇచ్చిన ఎన్నో హామీలను బుట్టదాఖలు చేశారనేది కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణ. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఆయన ధీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సిద్ధమైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు తమ హయాంలోనే ఆమోదం పొందిందని.. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం కాలేదని బీజేపీ విమర్శిస్తోంది. ఇటు బీజేపీ విమర్శలకు కూడా చెక్ పెట్టేలా కాంగ్రెస్ మహిళా అస్త్రాన్ని బయటకు తీయబోతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించింది. అయితే అది ఇప్పట్లో అమల్లోకి వచ్చేందుకు ఆస్కారం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలకు తామే మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నామని చెప్పేందుకు సిద్ధమైంది. అందుకోసం సీనియర్ నేత రేణుకా చౌదరిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేందుకు చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. వాళ్లందరికీ చెక్ పడాలంటే మహిళను తెరపైకి తీసుకురావడమే బెటర్ అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రేణుకా చౌదరి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.













