Raja Singh: రాజాసింగ్ రీ-ఎంట్రీకి సర్వం సిద్ధం..!?
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పార్టీ పుంజుకోలేకపోవడం ఇప్పుడు కమలనాథులను కలవరపెడుతోంది. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నా, వారిని నడిపించే నాయకత్వ లోపం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని రోజురోజుకూ బలహీనపరుస్తున్నాయి. ఈ స్తబ్దతను బద్దలు కొట్టేందుకు ఇప్పుడు అధిష్టానం రంగంలోకి దిగింది. ముఖ్యంగా, ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వంటి కీలక నేతలను తిరిగి పార్టీలో క్రియాశీలం చేయడం ద్వారా మళ్లీ పునర్జీవం పోసుకోవాలని భావిస్తోంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న రాష్ట్రంలో ఎందుకింత నిర్లక్ష్యం? ప్రతిపక్షంగా ఎందుకు విఫలమవుతున్నారు? అంటూ మోదీ రాష్ట్ర నేతలకు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండా, కేవలం గాలి వాటం విజయాలపై ఆధారపడటం సరికాదని ఆయన హెచ్చరించారు. దీంతో ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఆత్మశోధనలో పడింది. పార్టీ బలోపేతానికి ఉన్న ఏకైక మార్గం.. అలిగి దూరంగా ఉన్న పాతకాపులను, సిద్ధాంతపరంగా బలంగా ఉన్న నేతలను మళ్లీ దగ్గరకు చేర్చుకోవడమేనని డిసైడ్ అయ్యారు.
తెలంగాణ బీజేపీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో రాజా సింగ్ ముందు వరుసలో ఉంటారు. కరుడుగట్టిన హిందూవాదిగా, గోషామహల్ టైగర్ గా ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒంటిచేత్తో సీటు గెలిపించిన చరిత్ర ఆయనది. అయితే, గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వ పోకడ నచ్చక, తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆవేదనతో ఆయన పార్టీని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన మరే ఇతర పార్టీలో చేరకుండా అలాగే సొంతంగా పోరాడుతున్నారు.
రాజా సింగ్ లాంటి నేత పార్టీకి దూరమవ్వడం అంటే.. పార్టీ తన కోర్ ఓటు బ్యాంకు అయిన హిందుత్వ ఓటు బ్యాంకు దూరం చేసుకోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువత, క్షేత్రస్థాయిలో ఉండే హిందూ కార్యకర్తలు రాజా సింగ్ వైఖరికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనను పక్కన పెట్టి పార్టీని నడపడం ఆత్మహత్యాసదృశ్యమని అనేకసార్లు రుజువైంది. రాజా సింగ్ లేని సభలు వెలవెలబోతుంటే, ఆయన అడుగుపెడితే వచ్చే ఊపు వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇన్నాళ్లకు రాష్ట్ర నాయకత్వం గుర్తించినట్లుంది.
రాజా సింగ్ ను తిరిగి పార్టీలో క్రియాశీలం చేసేందుకు, ఆయన అలక పాన్పు దింపేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని, నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని రాజా సింగ్ గతంలో బాహాటంగానే విమర్శలు చేశారు. ఆయన లేవనెత్తిన అంశాల్లో వాస్తవం ఉందని గ్రహించిన అధిష్టానం, ఆయన్ను బుజ్జగించి మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని రాష్ట్ర శాఖను ఆదేశించింది. రాజా సింగ్ రీ-ఎంట్రీ కేవలం ఒక వ్యక్తి రాక మాత్రమే కాదు.. అది పార్టీలో ఒక నూతన ఉత్తేజానికి నాంది అని కేడర్ భావిస్తోంది. హైదరాబాద్ లోనే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఆయన పర్యటిస్తే యువతలో మళ్లీ పార్టీ పట్ల ఆకర్షణ పెరుగుతుందన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.
నిజానికి రాష్ట్ర నాయకత్వంలో కొందరికి రాజా సింగ్ రాక ఇష్టం లేకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అవసరం ఎంతైనా ఉందని ఒప్పుకోక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నా, బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవాలన్నా రాజా సింగ్ వంటి గట్టి గొంతుక పార్టీకి అత్యవసరం. అందుకే, విభేదాలను పక్కనబెట్టి ఆయన్ను సాదరంగా ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది.
మొత్తానికి, మోదీ వార్నింగ్ తో తెలంగాణ బీజేపీలో మార్పు మొదలైంది. రాజా సింగ్ ను తిరిగి చేర్చుకోవడం ద్వారా పార్టీ తన తప్పులను సరిదిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది కేవలం ఎన్నికల స్టంట్ లా కాకుండా, నిజమైన కార్యకర్తలకు, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నేతలకు పట్టం కట్టేలా ఉండాలి. రాజా సింగ్ రాకతోనైనా తెలంగాణ బీజేపీలో నిద్రాణంగా ఉన్న కేడర్ మేల్కొంటుందా? పార్టీ మళ్లీ రేసులోకి వస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం.. రాజా సింగ్ లేని తెలంగాణ బీజేపీ ఉప్పు లేని పప్పు లాంటిదే!






