రాజాసింగ్ పయనమెటు..?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ … రాజకీయంగా కూడలిలో ఉన్నట్లైంది. ఓవర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై అనర్హత వేటేసిన అధిష్టానం.. నెలలు గడుస్తున్నా, తొలగించడం లేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. పలుమార్లు రాజాసింగ్ పై ఉన్న అనర్హత వేటు ఎత్తివేయాలని కొరారు. అయితే హైకమాండ్ దీనికి సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో రాజాసింగ్ పక్కదారులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ మాత్రం బీజేపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు ఎత్తివేయకపోతే.. రాజకీయ సన్యాసమే అంటున్నారు.
ఎన్నివైపుల నుంచి ఎన్నిరకాలుగా ప్రయత్నించినా తనపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి హైకమాండ్ ముందుకు రాకపోవడంతో.. రాజాసింగ్ మనస్తాపానికి గురైనట్లు సమాచారం. దీనికి తోడు ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటివల మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో సమావేశమవ్వడంతో పార్టీ బోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తన నియోజకవర్గంలో కొన్ని సమస్యలున్నాయని.. వాటి పరిష్కారం కోసం మాత్రమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ వివరణ ఇచ్చారు.
ఎప్పుడైతే హరీశ్ రావును రాజాసింగ్ కలిశారో.. ఈ విషయంపై కమలంలోనూ పెనుచర్చకు దారితీసింది. దీంతో రాజాసింగ్ ఇంటికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఆయనతో చర్చించారు. మరోవైపు.. సస్పెన్షన్ కు గురైన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లడంపై జాతీయ నాయకత్వం సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి వెళ్ళడం సరి కాదంటూ ఈటలకు అధిష్టానం హితవు పలికింది.
బోనాల పండగ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య గోషామహల్లో గొడవ జరిగింది. మంగళ్ హాట్ డివిజన్లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వార్ ఉద్రిక్తతకు దారితీసింది. మంగళ్ హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై పోలీసులు వన్‌సైడ్‌గా కేసులు నమోదు చేశారని బీజేపీ ఆరోపించింది. రాజాసింగ్ నివాసంలో మంగళ్ హాట్ కార్పొరేటర్ శశికళను ఈటల పరామర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఈటల కాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్తో ఫ్లెక్సీ గొడవపై కార్పొరేటర్ శశికళను ఈటల అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు రాష్ట్ర బీజేపీ మాత్రం పాతబస్తీలో ఎంఐఎంకు ఎదురొడ్డి నిలవగలిగేది రాజాసింగ్ మాత్రమేనని… ఎన్నికల సమయానికి అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేడర్ కోరుతోంది. లేకుంటే బరిలో నిలవలేమంటోంది. ఆయన స్థానంలో ఎవరిని నిలబెట్టినా గెలవడం సాధ్యం కాదని తెగేసి చెబుతోంది. కానీ రాజాసింగ్ పై నిషేధం ఎత్తివేస్తే.. జాతీయస్థాయిలో ఉన్న మరికొందరిపైనా నిషేధం ఎత్తివేయాల్సి వస్తుందని హైకమాండ్ భావిస్తోంది.ఫలితంగా రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం.













