సెంటిమెంటు అస్త్రం
తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అందులో ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడు. సాక్షాత్తూ ఉద్యమవీరుడైన సీఎం కేసీఆర్.. సెంటిమెంట్ అస్త్రం సంధించి రెండు దఫాలుగా విజయం సాధించారు. హ్యాట్రిక్ కొట్టాలన్న థ్యేయంతో మరోసారి సెంటిమెంటు రగిల్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ గెలిస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కష్టాలు తప్పవంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.
అయితే .. లేటుగా వచ్చినా, లేటెస్టు అన్నట్లుగా .. రాహుల్ సైతం తెలంగాణలో సెంటిమెంటు రాజకీయాల్ని ఔపోసన పట్టేసినట్లుగా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంటు పండించగా.. ఈసారి దాన్ని రాహుల్ అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు రాహుల్. తనకు తెలంగాణతో ఉన్న సంబంధం రాజకీయ సంబంధం మాత్రమే కాదని, కుటుంబంతో ఉన్న అనుబంధమని రాహుల్ గాంధీ సెంటిమెంట్ పండించారు.
2004లో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేశామని పేర్కొన్న రాహుల్.., ఆ నిర్ణయాన్ని సోనియాగాంధీ తీసుకున్నారని, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు. మరి ఈ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు మాకు ఒక్క ఓటు ఇవ్వలేరా అంటూ ప్రజల్ని సెంటిమెంటుతో కట్టిపడేస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ ఇచ్చిన హామీలను మర్చిపోతే.. కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్నారు. రాజకీయంగా నష్టం కలిగే కార్యక్రమాలకు ఇతర రాజకీయ పార్టీలు దూరంగా ఉంటే.. కాంగ్రెస్ మాత్రం నష్టం కలుగుతుందన్నా కూడా రాష్ట్రాన్నిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసి చూపుతామని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో బీఆరెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ అని అన్నారు. తెలంగాణలో బీఆరెస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందన్నారు.వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు రాహుల్.













