PV SINDHU: సింధు పెళ్లికూతురాయె…!

భారత స్టార్ షట్లర్ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన సింధు త్వరలో పెళ్లి కూతురు కానుందని పీవీ సింధు తండ్రి శుభవార్తను పంచుకున్నారు. భారతీయ క్రీడా స్టార్ హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌తో డిసెంబర్ 22న ఏడడుగులు(sindhu marriage) వేయనుంది. పీవీ సింధు తన జీవితంలో అందమైన.. సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. కూతురు పెళ్లి గురించి 2024 డిసెంబర్ 2న సింధు తండ్రి అధికారికంగా ప్రకటించారు.
డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ‘లేక్ సిటీ’ ఉదయ్‌పూర్(uday pur)లో వివాహ వేడుకను జరిపించనున్నామని సింధు తండ్రి పివి రమణ తెలిపారు. సింధు పెళ్లి వార్త ఆమె అభిమానులను ఆనందపరిచింది. ఆమె వెంకటదత్త సాయి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నారు. వెంకట్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. డిసెంబరు 20 నుంచి వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 22న సింధు, వెంకట్ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరపనున్నామని ఆయన చెప్పారు.
ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. సింధు తన క్రీడా జీవితంలో ఎన్నో విజయాలను సాధించడమే కాకుండా, భారతదేశానికి ఒలింపిక్ పతకాలు అందించి గౌరవం తీసుకువచ్చింది. ఈ సందర్భంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పెళ్లి వార్త మరో మైలురాయి అని చెప్పవచ్చు. సింధు వివాహం కార్యక్రమం చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని సమాచారం. ఈ వేడుకల్లో తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.