షర్మిల ఆశలు అడియాశలవుతున్నాయా..!?
తెలంగాణాలో పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 9న ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రచార రథాన్ని కూడా షర్మిల ప్రారంభించారు. అయితే షర్మిల బహిరంగసభపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. లక్షమందికి తగ్గకుండా సభ నిర్వహించాలని షర్మిల మొదట నిర్ణయించారు. ఆ మేరకు తన అనుచరులకు దిశానిర్దేశం చేశారు. సభకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరారు. కానీ పోలీసులు మాత్రం ఐదారువేలకు మించకుండా సభ జరుపుకోవాలని నిర్ణయించారు. షర్మిల అనుచరులు కూడా సరేననుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో పోలీసులు కొత్తగా నోటీసులు ఇచ్చారు. దీంతో సభ జరుగుతుందా.. లేదా అనే సందేహం నెలకొంది. అయితే కోర్టుకు వెళ్లయినా పర్మిషన్ తెచ్చుకుని సభ నిర్వహిస్తామని షర్మిల అనుచరులు చెప్తున్నారు.
మరోవైపు.. తమ పార్టీకి ఊహించినంత ఊపు రావట్లేదని షర్మిల అభిమానులు, అనుచరులు ఫీలవుతున్నట్టు సమాచారం. పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించగానే వై.ఎస్.ఆర్. అభిమానులంతా తప్పకుండా తమవైపే చూస్తారని షర్మిల భావించారు. ఆమె కూడా వై.ఎస్. అభిమానులంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ఆమె పార్టీకి అభిమానుల నుంచి తప్ప నేతల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. దీంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై షర్మిల తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని భావించిన షర్మిల.. ఆ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని నమ్మారు. పైగా ఆ పార్టీలోనే వై.ఎస్. అభిమానులు ఎక్కువగా ఉన్నారని.. అలాంటి వాళ్లంతా పునరావాసం కోసం తప్పకుండా తన వెంట వస్తారని ఊహించారు. కానీ ఆ పార్టీ నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ల నుంచి పెద్దగా స్పందన లేదు. తాజాగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వై.ఎస్. అభిమానిగా, జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి గట్టు శ్రీకాంత్ రెడ్డి. ఆయన రాజీనామా చేసి షర్మిల పార్టీలో చేరుతారని అందరూ మొదట ఉహించారు. అయితే ఆయన షర్మిలకు షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో షర్మిల అనుచరులు ఖంగుతిన్నారు.
ముందు నుంచీ వైఎస్ఆర్ కుటుంబానికి వెన్నంటి ఉన్న నేతలో షర్మిల పార్టీ పట్ల ఆసక్తి చూపకపోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తప్ప.. మిగిలన పార్టీల్లో పరిస్థితి ఏమంత బాగాలేదని షర్మిల ఊహించారు. ఆయా పార్టీల్లోని అసంతృప్తులంతా తన వెంట వస్తారని కొండంత ఆశ పెట్టుకున్నారు. అయితే అది వర్కవుట్ కావట్లేదు. అందుకే పాత వైసీపీలోని నేతలను పార్టీలోకి తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే కొంతమంది నేతలను సంప్రదించారట. మరి వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనేది తెలియాల్సి ఉంది.













